
- కానిస్టేబుల్ కొలువు వదిలి.. టీచర్గా.. సొంత ఖర్చులతో స్కూల్లో వసతులు
- రోజూ కాలినడకన బడికి.. ఆటపాటలతో చదువు
మెదక్/కౌడిపల్లి, వెలుగు: చదువు మీద మమకారంతో పోలీసు ఉద్యోగాన్ని వదిలి.. టీచర్గా చేరిన యువకుడు మారుమూల తండాలో పిల్లల అవసరాలు, ఆకలి తీరుస్తూ విద్యాబుద్ధులు చెప్తున్నాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మాన్ సింగ్ తండాలోని ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తున్న మాణిక్యం టీచర్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన మాణిక్యం పేద కుటుంబంలో జన్మించాడు.
ఎలాగైనా ప్రభుత్వ కొలువు సాధించాలని కష్టపడి చదివి 2017లో పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ బెటాలియన్‌లో, ముషీరాబాద్, బాలనగర్ లో మూడేండ్లు పనిచేశాడు. టీచర్ వృత్తి మీద ఉన్న ఆసక్తితో 2019లో నిర్వహించిన డీఎస్సీ రాసి సెకండరీ గ్రేడ్ టీచర్ గా ఎంపికయ్యాడు.
తొలి పోస్టింగ్ మాన్ సింగ్ తండాలో
తొలి పోస్టింగ్ మాన్ సింగ్ తండాలో వచ్చింది. అతను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు ఏడుగురు స్టూడెంట్లు మాత్రమే ఉన్నారు. స్కూల్లో కనీస వసతులు లేవు. మంచినీళ్లు, కరెంటు కూడా లేని పరిస్థితి. వానపడితే స్కూలంతా నీటితో నిండిపోయేది. స్కూలు ను చక్కదిద్ది పిల్లలకు మంచి విద్యను అందించాలని భావించిన మాణిక్యం సొంత డబ్బుతో పాఠశాల ప్రాంగణాన్ని బాగు చేయించి.. వసతులు మెరుగు పరిచాడు.
విద్యార్థులకు నోట్ బుక్స్, స్టేషనరీ, షూ , టై, బెల్టు, స్పోర్ట్స్ డ్రెస్‌లు కొనిచ్చాడు. అక్కడ చదువుకునే పిలల్లు పేద కుటుంబాలకు చెందినవారని గుర్తించిన మాణిక్యం సొంత డబ్బులతో వారికి అల్పాహారాన్ని అందిస్తున్నారు. స్కూలు ఎవరైనా డుమ్మా కొడితే వారి ఇంటికి వెళ్లి సముదాయించి స్కూల్‌కు తీసుకొస్తాడు.
ఆట పాటలతో పాఠాలు చెప్తూ వారు ఆసక్తితో చదువుకునేలా చూస్తున్నాడు. క్లాస్ రూంలో తెలుగు అక్షర మాల, ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ తదితర చార్ట్‌లు ఏర్పాటు చేశారు. పిల్లలు ఆటలు నేర్పించడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నాడు. పిల్లల పుట్టిన రోజు పాఠశాలల్లోనే జరిపిస్తాడు.
ఉచితంగా నవోదయ కోచింగ్
మాణిక్యం పిల్లల కోసం చేస్తున్న కార్యక్రమాలను చూసి పక్కన ఉన్న జోడుబాయి తండాకు చెందిన ఎనిమిది మంది స్టూడెంట్స్ చేరడంతో ఇప్పుడు 15 మంది విద్యార్థులతో 5వ తరగతి వరకు క్లాసులు నడుస్తున్నాయి. అందరూ గిరిజనులే కావడంతో మాణిక్యం ఆరు నెలల్లోనే లంబాడి భాష నేర్చుకుని పిల్లలతో కలిసిపోయాడు. సొంత డబ్బులతో విద్యార్థులను జూ పార్కు, సాలార్జంగ్ మ్యూజియం తీసుకెళ్లాడు.
ఐదుగురు ఫిఫ్త్ స్టూడెంట్లకు నవోదయ ఎంట్రెన్స్ పరీక్ష కోసం స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తున్నాడు. తండా వరకు రోడ్డు సదుపాయం లేకపోవడంతో సలాబత్పూర్ బైక్ మీద వచ్చి అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు కాలినడకన మాన్సింగ్ తండాకు చేరుకుంటున్నాడు. మాణిక్యం వచ్చిన తర్వాత స్కూలు పూర్తిగా మారిపోయిందని తండా వాసులు చెబుతున్నారు.