- 24వేల మార్క్ దిగువన నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం ప్రారంభ లాభాలను నిలుపుకోలేక నష్టపోయాయి. అస్థిరమైన ట్రేడింగ్ కారణంగా సెన్సెక్స్ చివరికి 166 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 24వేల స్థాయి దిగువన స్థిరపడింది. బ్యాంకింగ్, టెలికం స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి వల్ల సెన్సెక్స్ 78,593.07 వద్ద స్థిరపడింది. దీనిలోని 17 షేర్లు నష్టపోగా, 13 లాభపడ్డాయి. జపనీస్, ఇతర ఆసియా స్టాక్‌లు పుంజుకోవడంతో పెట్టుబడిదారులు వాల్యూ బయింగ్ను ఎంచుకున్నారు. దీంతో సెన్సెక్స్1,092.68 పాయింట్లు పెరిగి 79,852.08 గరిష్ట స్థాయికి చేరుకుంది.
అయితే, గురువారం ఆర్‌బీఐ పాలసీ నిర్ణయానికి ముందు బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ భారీగా నష్టపోయి 78,496.57 కనిష్ట స్థాయికి చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 63.05 పాయింట్లు పడి 24వేలు స్థాయి కంటే దిగువన 23,992.55 వద్ద స్థిరపడింది. ఇంట్రా-డే ట్రేడ్‌లో ఇండెక్స్ 327 పాయింట్లు పెరిగి 24,382.60కి చేరుకుంది. లాభాలను నిలుపుకోవడంలో విఫలమైంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయంతో ఇండెక్స్‌లు గత మూడు రోజుల్లో 4 శాతానికిపైగా నష్టపోయాయి.