గ్రామ పంచాయతీ ఆఫీసు నుంచి సెక్రటేరియెట్ వరకు.. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి

 గ్రామ పంచాయతీ ఆఫీసు నుంచి సెక్రటేరియెట్ వరకు.. ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్లాంట్లు: భట్టి
  • అనువైన భవనాల వివరాలు 
  • వారం రోజుల్లో పంపండి
  • ఇందిరా సౌర గిరి జల వికాసం 
  • వేగవంతం చేయాలి
  • కలెక్టర్లతో రివ్యూలో డిప్యూటీ సీఎం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఆఫీసు మొదలుకొని సెక్రటేరియెట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్యానళ్లు ఏర్పాటు చేసి సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నా రు. శనివారం సెక్రటేరియెట్​లో కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌లో ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్‌‌‌‌వోఎఫ్‌‌‌‌ఆర్ భూముల్లో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సోలార్ పవర్ జనరేషన్ పెద్ద ఎత్తున పెంచేందుకు రాష్ట్ర కేబినెట్ విధాననిర్ణయం తీసుకుందన్నారు. 

అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థల భవనాలపై రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశిం చారు. ఈ స్కీం కోసం అవసరమైన డిజైన్లను హైదరాబాద్ నుంచి పంపిస్తామని, కలెక్టరేట్లు, పార్కింగ్, క్యాంటీన్ స్థలాల వివరాలను హైదరాబాద్‌‌‌‌కు పంపాలని సూచించారు. మంచి డిజైన్లు ఉంటే కలెక్టర్లు కూడా పంపవచ్చన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాల కోసం ఒక ప్రశ్నావళిని పంపిస్తామని, వారం రోజుల్లో అన్ని వివరాలను నమోదు చేసి విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసుకు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఈ నెలలో ఆదిలాబాద్​లో సౌర గిరి జల వికాసం

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్‌‌‌‌వోఎఫ్‌‌‌‌ఆర్ చట్టం కింద పంపిణీ చేసిన భూముల్లో ఇందిర సౌర గిరి జల వికాసం స్కీమ్​ద్వారా ఉచిత సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయనున్నట్లు భట్టి వెల్లడించారు. ఈ పథకాన్ని నల్లమల డిక్లరేషన్‌‌‌‌లో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ నెలలో ఆదిలా బాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు.

 ఈ పథకాల అమలుకు వారం రోజుల్లో అవసరమైన వివరాలను పంపాలని, ఏవైనా సందేహాలు ఉంటే విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎస్‌‌‌‌పీడీసీఎల్, ఎన్‌‌‌‌పీడీసీఎల్ సీఎండీలు, రెడ్కో వీసీఎండీలను సంప్రదించాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ఎస్‌‌‌‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ, రెడ్కో వీసీఎండీ అనిలా పాల్గొన్నారు.