పిట్ట కొంచెం రెక్క ఘనం.. తిండి లేకుండా 6 వేల కిలోమీటర్లు నాన్ స్టాప్ జర్నీ.. చరిత్ర సృష్టించిన ఫాల్కన్ పక్షులు !

పిట్ట కొంచెం రెక్క ఘనం..  తిండి లేకుండా 6 వేల కిలోమీటర్లు నాన్ స్టాప్ జర్నీ.. చరిత్ర సృష్టించిన ఫాల్కన్ పక్షులు !

పక్షికి, విమానానికి పోటీ పెడితే ఏది గెలుస్తుందని పిల్లలు పెద్దలను ప్రశ్నలు అడుగుతుంటారు.  పక్షే గెలుస్తుందని కొందరు తెలివిగా పిల్లలకు చెప్తుంటారు. అదేంటి  విమానం వేగంగా వెళ్తుంది కదా.. మరి ఎందుకు ఓడుతుంది.. అని పిల్లలు డౌట్ అడుగుతుంటారు. ఇంధనం ఉన్నంత వరకే విమానం వెళ్తుంది.. ఆ తర్వాత ఆగిపోతుంది.. కానీ పక్షి ఎలాంటి ఇంధనం లేకుండా వెళ్తుంది కదా.. అందుకే గెలుస్తుందని వాళ్ల సందేహాన్ని నివృత్తి చేస్తుంటారు. 

పైన చెప్పిన ముచ్చట కథ రూపంలో చెప్పినా.. ఇప్పుడు అదే నిజం అని నమ్మాల్సిన పరిస్థితి. ఎందుకంటే చిన్న పక్షి.. సముద్రాలను, ఖండాలను దాటి.. నాన్ స్టాప్ గా వేల కిలోమీటర్లు వలస వెళ్లటం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేసిందట.  అముర్ ఫాల్కన్స్ అనే గ్రద్ద  జాతి పక్షులు వలస వెళ్లే క్రమంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించాయట. మణిపూర్ అడవి నుంచి మొదలైన ప్రయాణం ఖండాలు, సముద్రాలు దాటి మరో ప్రాంతానికి చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శాటిలైట్ ట్యాగ్స్ వేసి పక్షుల ప్రయాణాన్ని ట్రాక్ చేయగా.. వాటి శక్తిని చూసి సైంటిస్టులు షాకయ్యారు.  

ఏంటి ఈ పక్షుల స్పెషాలిటీ..?

అపపాంగ్, అలాంగ్, అహు అనే మూడు పక్షులు శాస్త్రవేత్తలను ఆకాశం వైపు ముక్కున వేలేసుకునేలా చేశాయి. కేవలం 150 గ్రాముల బరువుండే ఈ పక్షులు ఇంత సుదీర్ఘమైన దూరాన్ని నాన్ స్టాప్ గా చేరుకోవడంపై సైంటిస్టులు పరిశోధన చేయాల్సిందేనని భావిస్తున్నారు. 

రికార్డు సృష్టించిన అపపాంగ్:

కేవలం 6 రోజుల 8 గంటల్లో  6 వేల 100 కిలోమీటర్లు ప్రయాణించి షాకింగ్ కు గురిచేశాయి ఈ పక్షులు. అపపాంగ్ పక్షి మణిపూర్ అడవుల నుంచి భారత ద్వీపకల్ప భూమిని దాటి, అరేబియా సముద్రం మీదుగా వెళ్లి.. కెన్యాలో ల్యాండ్ అయ్యింది. ఒక చిన్న పక్షి నాన్ స్టాప్ గా.. అత్యంత దూరం ప్రయాణించినట్లుగా రికార్డు సృష్టించినట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ఆరెంజ్ మార్కర్ తో ఈ పక్షిని ట్యాగ్ చేసి.. శాటిలైట్ ద్వారా ట్రాక్ చేయగా.. రికార్డు దూరం ప్రయాణించినట్లు వెల్లడైనట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

అలాంగ్ పక్షి:

ఆ మూడు పక్షులలో చిన్నదైన అలాంగ్ పక్షి.. ఎల్లో (పసుపు) ట్యాగ్ తో ట్రాక్ తో ఈ పక్షిన ట్రాక్ చేశారు సైంటిస్టులు. 6 రోజుల 14 గంటల్లో 5 వేల 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఈ పక్షి తెలంగాణలో ఒక రాత్రి, మహారాష్ట్రలో మూడు గంటలు మాత్రమే రెస్ట్ తీసుకుని.. ఆ తర్వాత నాన్ స్టాప్ గా.. కెన్యాను చేరుకుందట. ఇది వాటి సమూహంలో చన్నది, వలస కూడా తొలిసారి అయినప్పటికీ.. అంత దూరం వెళ్లటం ఆశ్చర్యానికి గురిచేసినట్లు చెబుతున్నారు. 

అహు :

రెడ్ ట్యాగ్ తో ఉన్న ఈ ఫాల్కన్.. ఉత్తర దిశగా వెళ్తూ.. బంగ్లాదేశ్ పశ్చిమం మీదుగా.. అరేబియా సముద్రాన్ని దాటింది. మొత్తం 5 వేల 100 కిలోమీటర్లు ప్రయాణించి.. సోమాలియా చేరుకుంది. అక్కడి నుంచి కెన్యాలోని సవో నేషనల్ పార్క్ కు చేరుకుని తన సమూహంతో కలుస్తుందని చెబుతున్నారు సైంటిస్టులు. 

ఇంత దూరం నాన్ స్టాప్ గా వలస వెల్లే ఈ అముర్ ఫాల్కన్ పక్షులను అరుదైన జాతిగా సైంటిస్టులు చెబుతున్నారు. అవి వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్తుంటాయని.. వాటి ప్రయాణానికి ఆటంకం కల్పించకుండా.. పరిరక్షించాల్సిన బాధ్యత, ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత  ప్రపంచ దేశాలపై ఉందని పేర్కొన్నారు.