భారతీయులకు బంగారం ఒక సెంటిమెంట్. ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా గోల్డ్ ప్రాముఖ్యతను తరతరాలుగా భారత సంస్కృతి నుంచి పెద్దగా ఎవ్వరూ మార్చలేకపోయారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిన ప్రతిసారీ భారత పాలకులు బంగారంపై కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. 1962 నాటి మొరార్జీ దేశాయ్ చట్టం నుండి నేటి నరేంద్ర మోడీ పిలుపు వరకు.. గోల్డ్ పై జరిగిన 'రాజకీయ సర్జికల్ స్ట్రైక్స్' చరిత్ర ఇప్పుడు తెలుసుకుందాం..
మొరార్జీ దేశాయ్ ‘గోల్డ్ కంట్రోల్’ షాక్ (1962):
భారత-చైనా యుద్ధం ముగిసిన తర్వాతి రోజుల్లో దేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ‘గోల్డ్ కంట్రోల్ యాక్ట్’ ద్వారా బంగారంపై ఉక్కుపాదం మోపారు. ప్రజలు బిస్కెట్లు, కాయిన్ల రూపంలో బంగారం ఉంచుకోవడాన్ని నిషేధించారు. అంతేకాదు జ్యువెలరీ తయారీలో కేవలం 14 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే వాడాలనే రూల్స్ తెచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది.
గోల్డ్ బాండ్స్.. పన్ను మినహాయింపులు(1965):
1965లో దేశం మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. ప్రజల వద్ద ఉన్న బ్లాక్ మనీని బయటకు తీసేందుకు ప్రభుత్వం 'గోల్డ్ బాండ్' స్కీమ్‌ను తెచ్చింది. ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వానికి ఇస్తే.. ఆ సంపద ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎటువంటి ప్రశ్నలు అడగబోమని, పన్ను మినహాయింపు ఇస్తామని ప్రకటించారు. దేశభక్తి పేరుతో బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తెచ్చేందుకు జరిగిన తొలి ప్రయత్నం ఇది.
బంగారం తాకట్టు (1991):
భారత ఆర్థిక చరిత్రలో ఇది అత్యంత బాధాకరమైన ఘటన. తీవ్రమైన ఫారెక్స్ రిజర్వ్స్ సంక్షోభం తలెత్తడంతో.. అప్పటి చంద్రశేఖర్ ప్రభుత్వం గత్యంతరం లేక 46.91 టన్నుల రిజర్వ్ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తాకట్టు పెట్టి లోన్స్ తీసుకుంది. దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా మసకబారిన పరిస్థితి ఇది. అయితే ఆ తర్వాత వచ్చిన సంస్కరణలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేశాయి.
మోడీ ‘ఆర్థిక దేశభక్తి’ పిలుపు (2026):
మే 10, 2026న హైదరాబాద్ వేదికగా ప్రధాని మోడీ చేసిన ప్రకటన సరికొత్త చరిత్రకు నాంది పలికింది. ఏడాది పాటు అత్యవసరం అయితే తప్ప బంగారం కొనకండి అంటూ పిలుపునిచ్చారు. దీన్ని కేవలం ఒక విజ్ఞప్తిలా కాకుండా ఆర్థిక దేశభక్తిగా అభివర్ణించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల డాలర్లు ఆవిరవుతున్న వేళ, రూపాయిని కాపాడేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆనాడు మొరార్జీ దేశాయ్ చట్టం ద్వారా బలవంతం చేస్తే.. ఇప్పుడు మోడీ సెంటిమెంట్‌తో ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకూ భారత ప్రధానులకు బంగారం ఎప్పుడూ ఒక పెద్ద సవాలుగానే నిలిచింది. దేశ ఆర్థిక భద్రత కోసం జనం మెడలోని బంగారాన్ని ఖజానాకు మళ్లించడం, దిగుమతులను అడ్డుకోవడం పాలకులకు తప్పనిసరి అవుతోంది. 1991లో తాకట్టు పెట్టిన దేశం నుంచి 2026లో ఆర్బీఐ ద్వారా రికార్డు స్థాయిలో బంగారం కొంటున్న దేశంగా ఎదగడం వెనుక ఈ గోల్డ్ పాలిటిక్స్ ఎంతగానో ప్రభావం చూపాయి. చూడాలి ప్రస్తుతం ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపును ప్రజలు ఎంత వరకూ పాటిస్తారో అన్నది.
