మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ నుంచి ప్రయాణం వరకు సమస్యలే

మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ నుంచి ప్రయాణం వరకు సమస్యలే

హైదరాబాద్, వెలుగు: మెట్రో ట్రైన్ సిటీలో ప్రయాణాన్ని సులభతరం చేసింది. ట్రాఫిక్ జామ్ కష్టాల నుంచి గట్టెక్కించింది. గంటల ప్రయాణాన్ని నిమిషాలకు తగ్గించింది. అందుకే  సిటిజన్లు మెట్రోలో వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  సిటీలో ప్రతిరోజూ నాలుగు లక్షల మందికిపైగా మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. అయితే జర్నీ వరకు బాగానే ఉన్నా.. ప్యాసింజర్లు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్టేషన్​కు రాకపోకలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవడం దగ్గర్నుంచి వెహికల్ పార్కింగ్, పనిచేయని ఎస్కలేటర్లు, మొరాయించే సర్వీస్ లిఫ్ట్‌‌లతోపాటు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

ట్రాఫిక్ సమస్య లేకుండా ట్రావెలింగ్..

ట్రాఫిక్ జామ్‌‌లో గంటల కొద్దీ అవస్థలు పడే కంటే.. మెట్రోలో  వెళ్తే త్వరగా గమ్యస్థానానికి చేరుకొవచ్చని ప్యాసింజర్లు భావిస్తుండటంతో దీనికి ఆదరణ బాగా పెరిగింది. దీంతో  మూడు కారిడార్లలో మెట్రో ట్రైన్లు నిత్యం రద్దీగా తిరుగుతున్నాయి. లాస్ట్ ట్రైన్ సర్వీస్ టైమింగ్స్ పొడిగించడంతో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. మెట్రోలో వెళ్లే వారి సంఖ్య పెరిగే కొద్దీ సదుపాయాలు పెంచాల్సింది పోయి సమస్యలు ఏర్పడుతున్నా పట్టించుకోవడంలేదని ప్యాసింజర్లు వాపోతున్నారు.

పెయిడ్ పార్కింగ్ నిర్వహణ సరిగా లేక.. 

ఇంటి నుంచి మెట్రో స్టేషన్​కు చాలామంది సొంత వెహికల్​లోనే వస్తుంటారు. అయితే వాటిని పార్క్​ చేసేందుకు స్టేషన్ కింద షెడ్స్ లేకపోవడం, రోడ్ల పక్కన పెయిడ్ పార్కింగ్ చేసినా వాళ్లు పట్టించుకోకపోవడంతో చలాన్ల బారిన పడుతున్నారు. కొన్నిసందర్భాల్లో ఇల్లీగల్ పార్కింగ్ పేరుతో వెహికల్స్​ను పోలీసులు సీజ్​ చేస్తున్నారు. తార్నాక, హబ్సిగూడ, ఉప్పల్, స్టేడియం, నాగోల్​తోపాటు పలు ఏరియాల్లో పార్కింగ్ షెడ్‌‌లు లేవు. హైటెక్ సిటీ ఏరియాలోనూ రోడ్‌‌ మీదే బైక్‌‌లు పార్క్ చేసి వెళ్తున్నారు. మెట్రో స్టేషన్‌‌ పైకి వెళ్లేందుకు మెట్లు, ఎస్కలేటర్లు ఉండగా చాలాచోట్ల ఒకవైపు ఓపెన్ చేసి మిగతా వైపు మూసేస్తున్నారు. దీంతో ప్యాసింజర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వృద్ధులకు ఉపయోగంగా ఉండే సర్వీస్ లిఫ్ట్‌‌లు సైతం పనిచేయడం లేదు. దీంతో మెట్లు ఎక్కి, దిగలేక వారు అవస్థలు పడుతున్నారు. పెద్దమ్మ గుడి, మూసాపేట బాలానగర్, ఎర్రమంజిల్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్ స్టేషన్లలో లిఫ్ట్‌‌లు, ఎస్కలేటర్లు సరిగా పనిచేయడం లేదు. దీంతో ఆ మార్గాల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

సెక్యూరిటీ అంతంతే..

మెట్రో ట్రైన్​లో ప్రయాణం సేఫ్​గానే ఉన్నా.. స్టేషన్‌‌లో మాత్రం ప్యాసింజర్లు ఒకింత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.  ప్లాట్ ఫామ్ నుంచి కిందకి వచ్చాక ఆయా ఫ్లోర్లలో లైట్లు వెలగడంలేదు. మధురానగర్, సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్ స్టేషన్లలో, కింద లైట్లు ఆఫ్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో స్టేషన్లు నిర్మానుష్యంగా ఉండటం, లైట్లు లేకపోవడంతో ప్యాసింజర్లు భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఒక్కో స్టేషన్​లో నలుగురు నుంచి ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది ఉంటే ప్రస్తుతం వారిని సగానికిపైగా కుదించారు. సెక్యూరిటీ లేకపోవడంతో మెట్ల దారులు, వాటి పరిసరాలు ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి.  దీంతో రాత్రి సమయాల్లో భయంతో వెళ్లాల్సి వస్తోందని అమ్మాయిలు చెబుతున్నారు.

టికెట్ రేట్ల పెంపు!

ప్రస్తుతం మెట్రో ట్రైన్ టిక్కెట్‌‌ రేటు కనిష్ఠంగా రూ.10 ఉండగా.. గరిష్ఠంగా రూ.60 వరకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో ఎల్‌‌అండ్‌‌టీ హైదరాబాద్‌‌ మెట్రో ట్రైన్ ఈ చార్జీలను అమలు చేస్తోంది.  అయితే ప్రస్తుతం టికెట్ రేట్లను పెంచాలని భావిస్తోంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. ఈ నెల 15లోపు ప్యాసింజర్ల అభిప్రాయాలతో టికెట్ రేట్లను 
పెంచనున్నారు. కానీ రేట్ల పెంపు అంశంపై ప్యాసింజర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. కుదిరితే రేట్లు తగ్గించాలని, కానీ పెంచొద్దని మెట్రో రైల్ సంస్థను వారు కోరుతున్నారు.

మహిళల కోచ్​లో మగవాళ్లు

రోజురోజుకి మెట్రో ట్రైన్లు రద్దీగా మారుతున్నాయి. ఉదయం, సాయంత్రం కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. అయితే, మహిళల కోసం కేటాయించిన ప్రత్యేక కోచ్​లో మగవాళ్లు కూడా ఎక్కుతున్నారు. దీంతో అమ్మాయిలు అసౌకర్యానికి గురవుతున్నారు. టోల్ ఫ్రీ నంబర్​కు 
కాల్ చేసినా, ట్విట్టర్​లో ట్వీట్ చేస్తే.. సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారే తప్ప ఎలాంటి మార్పు ఉండటం లేదని అమ్మాయిలు చెబుతున్నారు.

పార్కింగ్​కే ఎక్కువ ఖర్చు

డైలీ ఉప్పల్ స్టేడియం నుంచి రాయదుర్గం స్టేషన్​కు  ట్రావెట్ చేస్తుంటా. ఇంటి నుంచి వెహికల్ లో వచ్చి  ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేస్తా.  కానీ ప్రతిరోజు పార్కింగ్‌‌ చార్జీలకే చాలా అమౌంట్ ఖర్చవుతోంది. గతంలో షటిల్ వెహికల్స్ ఉండేవి. ఇప్పుడవి లేవు. మళ్లీ ఏర్పాటు చేస్తే  బాగుంటుంది. అలాగే స్టేషన్​లో సెక్యూరిటీ కూడా పెంచాలి.
- శ్రీధర్, ప్యాసింజర్, ఉప్పల్

స్టేషన్​లో  లైట్లు వెలగట్లే..

డైలీ మధురానగర్, యూసఫ్ గూడ నుంచి మాదాపూర్ కు ట్రావెల్ చేస్తుంటా.  రాత్రి వేళ మధురానగర్ స్టేషన్​లో లైట్లు వెలగకపోవడంతో మెట్లు దిగే దగ్గర చీకటిగా ఉంటోంది. ఒంటరిగా వెళ్లాలంటే భయంగా ఉంటోంది. మెట్రో అధికారులు దీనిపై ఫోకస్ పెడితే బాగుంటుంది. 
-‌‌‌‌ నిత్య శ్రీ, స్టూడెంట్, మాదాపూర్