పగలు పానీపూరీ.. రాత్రి వీధిలైట్లు.. కట్ చేస్తే ఇస్రోలో జాబ్.. ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే ..!

పగలు పానీపూరీ.. రాత్రి వీధిలైట్లు.. కట్ చేస్తే ఇస్రోలో జాబ్.. ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే ..!

కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. ఇది పాత మాట.. కసి, పట్టుదల ఉంటే మనుషులు ఏదైనా సాధిస్తారనేది  కొత్త మాట. ఈ స్టోరీ చదివాక ఈ మాట మీరు కూడా అంటారు. ఎందుకంటే.. ఎవరి దశ ఎప్పుడు తిరుగుతుందో.. ఎవరి ఫేట్ ఎప్పుడు మారుతుందో ఎవరూ చెప్పలేరు. పరిస్థితులు బాలేవనో.. డబ్బు లేదనో వందలో 99 మంది కాంప్రమైజ్ అయినా.. ఆ ఒక్కడు.. ఎంచుకున్న లక్ష్యాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా సాధించి తీరతాడు. అలాంటి కార్య సాధకుడే మనం మాట్లాడుకుంటున్న రాందాస్ హేమరాజ్.

రోజంతా పానీ పూరీ అమ్మేందుకు చుట్టు పక్కల ఊర్లన్నీ తిరిగే వ్యక్తి.. ఉన్నట్లుండి ఇస్రో సైంటిస్ట్ అవ్వడం పట్ల తెలిసిన వాళ్లు, చుట్టుపక్కల ఊర్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘‘అరే మొన్నటి దాకా మన ఊరికి వచ్చి పానీ పూరీ అమ్మేవాడు.. ఇదేంటి సైంటిస్టు అంటున్నారు..’’ అంటూ చాలా మంది నోరెళ్లబెడుతున్నారు. మట్టిలో మాణిక్యం.. వెలిగేంత వరకు కనపడదు.. అంటే ఇదేనేమో. 

మహారాష్ట్రకు చెందిన రాందాస్ హేమరాజ్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాడు. కారణం.. పేదరికాన్ని దాటి.. ఇస్రో లో జాబ్ కొట్టే స్థాయికి ఎదిగాడు. చదువుకుందాం అంటే డబ్బు లేదు. పేదరికంతో కుటుంబం గడవటమే కష్టం. డబ్బులు ఇవ్వమని పేరెంట్స్ ను అడగలేని పరిస్థితి. అందుకే ఇప్పుడున్న యూత్ పడే ‘నామూష్’ అనే పదాన్ని పక్కన పెట్టి సొంతంగా చదువుకునేందుకు, కుటుంబాన్ని పోషించేందుకు కావాల్సిన డబ్బు సంపాదించేందుకు పానీ పూరీ బండిని ఎంచుకున్నాడు. 

మహారాష్ట్రలోని గోండియా జిల్లా ఖైర్ బోడి గ్రామానికి చెందిన వాడు రాందాస్. తండ్రి స్కూల్ లో ప్యూన్ గా చేసి రిటైర్డ్ అయ్యాడు. తల్లి హోమ్ మేకర్. పేదరికంలో అతనికి పేరెంట్స్ డబ్బులు ఇవ్వలేక పోయారు కానీ.. ఏదైనా సాధించాలంటే కసి, పట్టుదల ఉండాలనే మోరల్ సప్పోర్ట్ అయితే ఇచ్చారు. 

స్ట్రీట్ లైట్స్ కింద చదువుతుంటే పిచ్చోడు అనుకున్నారు:

పగలంగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు తిరిగి పానీ పూరీ అమ్మేవాడు రాందాస్. రాత్రి తిన్నా తినకున్నా.. వీధిలైట్ల కింద చదవుతూ ఉండేవాడు. వీడెవడో అడుక్కు తినే బాపతి.. పొచ్చోడు అనుకునేవారట చాలామంది. డైరెక్ట్ గా రాందాస్ ను పిచ్చోడు అని హేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. ఎందుకంటే ఈ రోజుల్లో చదివే వారే తక్కువ.. అందులో వీధిలైట్ల కింద ఎవరైనా చదువుతారా..? రాందాస్ వయసులో ఉండి కాలేజ్ కెళ్లే యూత్ కూడా హేళన చేసిందంటే చూడండి చదువు పట్ల, చదివేవారి పట్ల ఎలాంటి ఒపీనియన్ ఉందో.

ఎవరు హేళన చేసినా.. రోజంతా పానీ పూరి.. రాత్రి వీధి లైట్ల కింద చదివేవాడట ఈ రాందాస్. ఏదైనా సాధించాలి.. పేదరికం నుంచి బయట పడాలి.. చుట్టు పక్కల ఎవరూ చేయలేని పని చేయాలనే సంకల్పంతో చదవును కొనసాగించాడట రాందాస్. 

టెక్నికల్ స్కిల్స్.. టర్నింగ్ పాయింట్:

ఇంటర్ వరకు చదివిన రాందాస్.. కేవలం డిగ్రీ చేయడం వలన అనుకున్నది సాధించలేనని టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడానికి తిరోరాలోని ఐటీఐ లో చేరాడట. పంప్ ఆపరేటర్-మెకానిక్ కోర్స్ లో చేరి ఇంజినీరింగ్ స్కిల్స్ నేర్చుకున్నాడు. వివిధ సామాగ్రిని రిపేర్ చేయడం.. పంప్ ఆపరేట్ చేయడం, వాటర్ ట్రీట్ మెంట్, ఫిల్టరేషన్ మొదలైన పనులు నేర్చుకున్నాడు. ఈ స్కిల్సే అతన్ని సైంటిస్ట్ అయ్యేందుకు ఉపయోగపడ్డాయి. 

కల నిజమైన వేళ:

ఇస్రో అప్రెంటీస్ ట్రైనీ కోసం 2023లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నాగ్ పూర్ లో పరీక్ష రాసి.. 2024లో శ్రీహరి కోటలోని ఇస్రో కేంద్రంలో ప్రాక్టికల్ స్కిల్స్ టెస్ట్ కూడా పాసయ్యాడు. ఆ తర్వాత 2025 లో అఫీషియల్ అపాయింట్ లెటర్ రావడంతో రాందాస్ ఆనందానికి అవధులు లేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట ఇస్రో స్పేస్ సెంటర్ లో పంప్ ఆపరేటర్ - మెకానిక్ గా.. ఇండియా స్పేస్ మిషన్ లో భాగస్వామ్యం అయ్యాడు. అతడు రాకెట్స్ డిజైన్ చేయకపోయినప్పటికీ.. కోడ్ రాయనప్పటికీ.. స్పేస్ మిషన్ లో ఉండే క్రిటికల్ టెక్నికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను మెయింటైన్ చేస్తూ.. సిస్టం నడవటంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

పగలు పానీ పూరీ అమ్మి.. రాత్రి స్ట్రీట్ లైట్ల కింద.. అదీ లేట్ నైట్స్ లో చదువుతూ.. ఎవరు హేళన చేసినా పట్టించుకోకుండా.. ఇస్రోలో పనిచేసే స్థాయికి ఎదగటం ఎంతో మందికి ఆదర్శం. ప్రపంచంలో ఎవరికీ ఓవర్ నైట్ లో సక్సెస్ రాదు. పట్టుదలతో ఎంచుకున్న రంగంలో ఏ టు జెడ్ వరకు ఔపోసన పడితే విజయం వెతుక్కుంటూ వస్తుంది.. అనటానికి రాందాస్ హేమరాజ్ మర్బాడే స్టోరీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు.