
ప్రజల అవసరాన్ని మర్చిపోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంతో గిల్లికజ్జాలు పెట్టుకొని రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును పక్కన పడేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సికింద్రాబాద్ అల్వాల్ టిమ్స్ సమీపంలో రాజీవ్ రహదారి ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ‘దాదాపు నలభై ఏండ్ల నుంచి హైదరాబాద్ సహా మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజలు రాకపోకలకు తిప్పలు పడుతున్నా.. ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నా గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదన్నారు.
మొత్తం 18.10 కి.మీ. పొడవు.. ఆరు వరుసలు..
- రాజీవ్ రహదారిపై కారిడార్ సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ సమీపంలోని ఓఆర్ ఆర్ జంక్షన్ వద్ద ముగుస్తుంది.
- మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 11.12 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు.
- ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్ వద్ద), అల్వాల్ వద్ద (0.310 కిలోమీటర్ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు.
- ఈ కారిడార్‌తో ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల సాకారం కానుంది. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లు పడిన కష్టాలు తీరుతాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ. 2,232 కోట్ల వ్యయంతో ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపడుతున్నారు.
- ఎలివేటెడ్ కారిడార్‌కు అవసరమైన భూమి: 197.20 ఎకరాలు. ఇందులో రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు.. ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు.
- ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ ఫర్ డే -పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్ ఆర్ జంక్షన్ సమీపంలో 35,825గా ఉంది. అసలే ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు, ప్రయాణికులు హడలిపోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలిసిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బాధలు తొలగిపోతాయి.