ప్లాటినం జ్యువెలరీ దిగుమతులపై ఆంక్షలు.. ఎప్పటి వరకు అంటే..

ప్లాటినం జ్యువెలరీ దిగుమతులపై ఆంక్షలు.. ఎప్పటి వరకు అంటే..

భారత ప్రభుత్వం విలువైన ప్లాటినం ఆభరణాల దిగుమతులపై కొత్త నియంత్రణలను విధించింది. వాణిజ్య నియమాలను కట్టుదిట్టం చేస్తూ ఈ పరిమితులు వెంటనే అమల్లోకి రావడంతోపాటు 2026 ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(DGFT) సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు ఫ్రీ కేటగిరీ కింద దిగుమతికి అనుమతించబడిన ప్లాటినం ఆభరణాలను రిస్ట్రిక్టెడ్ కేటగిరీలోకీ తీసుకొచ్చింది. దీంతో ఇకపై ప్లాటినం ఆభరణాలను దేశంలోకి తెచ్చుకోవాలంటే దిగుమతిదారులు ప్రత్యేక లైసెన్సు కోసం DGFT అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. 

ఈ నిర్ణయం వెనుక కీలక కారణం భారతదేశం..థాయ్‌లాండ్, ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం (ASEAN)తో ఉన్న ఉచిత వాణిజ్య ఒప్పందాలను దుర్వినియోగాన్ని అరికట్టడమేనని తెలుస్తోంది. గతంలో వెండి ఆభరణాల దిగుమతులను కూడా ప్రభుత్వం ఇలాంటి కారణాలతో పరిమిత కేటగిరీలోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వెండి ఆభరణాలపై 2026 మార్చి 31 వరకు ఆ నిబంధనలు అమల్లో ఉంచింది.

►ALSO READ | ఫొటోగ్రాఫీ కోసం వివో కొత్త 5జి ఫోన్స్.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే.. త్వరలోనే లాంచ్..

కొందరు దిగుమతిదారులు థాయ్‌లాండ్ నుంచి స్టోన్స్ లేని వెండి ఆభరణాలను భారీ స్థాయిలో తక్కువ సుంకంతో దిగుమతి చేశారని అధికారులు గుర్తించారు. ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల సౌకర్యాలను వాడుకొని ఖరీదైన విలువైన లోహాలను అనుమతిలేని మార్గాల్లో దేశంలోకి తేవడం వల్ల ఇతర రంగాలపై ప్రభావం పడిందని వారు చెబుతున్నారు. అందువల్ల కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ప్లాటినం ఆభరణాల దిగుమతికి ముందు అనుమతి తప్పనిసరి. 

ఈ పరిమితులు తక్షణ కాలంలో ధరల పెరుగుదలకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ.. దేశీయ ప్లాటినం ఆభరణాల తయారీ రంగానికి దీర్ఘకాలంగా లాభం కలిగిస్తాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వాణిజ్య లోటును తగ్గించడం, విదేశీ మారక నిల్వలను రక్షించడం, న్యాయమైన వాణిజ్య విధానాలను కొనసాగించడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని తెలుస్తోంది.