6 నెలలుగా సైబర్ మోసగాళ్ల గ్రిప్పులో మహిళ.. ఏకంగా రూ.32 కోట్లు స్కామ్..

6 నెలలుగా సైబర్ మోసగాళ్ల గ్రిప్పులో మహిళ.. ఏకంగా రూ.32 కోట్లు స్కామ్..

డిజిటల్ అరెస్ట్ మోసాల గురించి ప్రజల్లో ఎంత చైతన్యం కలిగించినా ఇప్పటికీ అలాంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వేలు కాదు లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు బాధితులు. సైబర్ నేరగాళ్లు ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగులు, పెద్ద వయస్సు ఉన్నవారు, టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేనివారినే తమ నేరాల కోసం టార్గెట్ చేస్తున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

తాజాగా బెంగళూరులో ఇండిరానగర్ కి చెందిన 57 ఏళ్ల ఐటీ నిపుణురాలు సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో చిక్కుకుంది. గత ఆరు నెలల్లో రూ.31.83 కోట్లు ఆమె నుంచి పలు దఫాలుగా మోసగాళ్లు వసూలు చేశారు.2024 సెప్టెంబర్ 15న ఈ ఘటన ప్రారంభమైంది. ఆమెకు డిహెచ్ఎల్ కొరియర్ సంస్థ సిబ్బంది పేరుతో ఫోన్ కాల్ వచ్చింది. ముంబై కార్యాలయంలో ఆమె పేరుతో వచ్చిన పార్సిల్‌లో క్రెడిట్ కార్డులు, పాస్ పోర్టులు, MDMA మాదక ద్రవ్యాలు ఉన్నాయని చెప్పి భయపెట్టారు. ఆమెకు తానేమీ సంబంధం లేదని చెప్పినా.. ఫోన్ వెంటనే “సైబర్ క్రైమ్ సెల్”కు కలిపామని నటించారు. తర్వాత సీబీఐ అధికారిగా నటించిన వ్యక్తి ఆమెపై విచారణ మొదలుపెట్టాడు. 

దీని నుంచి రక్షించటానికి తమ మాట వినాలని.. అంతర్జాతీయ నేరగాళ్లు తనను గమనిస్తుంటారంటూ భయపెట్టారు. లోకల్ పోలీసులకు ఈ విషయం చెప్పొద్దని బెదిరించారు. ఆ సమయంలో తన కుమారుడి వివాహం ఉండటంతో రక్షణ కోసం ఆమె వారి మాటలు నమ్మి అలాగే నడుచుకుంది. ఆ సమయంలో నేరగాళ్లు ఆమెను నిరంతరం స్కైప్ వీడియో ద్వారా నియంత్రించారు. 

ఆ తర్వాత సెప్టెంబర్ 23న ఆమెను ఓ హోటల్‌కి వెళ్లమని చెప్పి, తన సంపూర్ణ ఆస్తుల వివరాలు ఆర్బీఐ ఆర్థిక నిఘా విభాగానికి సమర్పించాలని ఒత్తిడి చేశారు. అలా ఆమె వద్ద నుంచి 187 ట్రాన్సాక్షన్ల రూపంలో రూ.32 కోట్లు కొట్టేశారు. డబ్బు తిరిగి వస్తుందని నమ్మించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పటికీ స్కైప్ ద్వారా రోజూ నివేదిక ఇవ్వాల్సిందిగా ఒత్తిడి చేశారు. అయితే దీనిపై ఆమె నవంబర్ 14న సైబర్ క్రైమ్ అధికారులు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె తొందరగా ఎవరికైనా చెప్పి కాల్‌ కట్‌చేసి ఉంటే, ఈ నష్టం నివారించబడేదని సైబర్ పోలీసులు అన్నారు.