దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్  ధరలు పెరిగాయి. దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాయి చమురు కంపెనీలు. పెరిగిన ధరలు ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు వంటగ్యాస్ సిలిండర్ ధరను కూడా పెంచాయి చమురు సంస్థలు. 14 కిలోల వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచాయి. పెరిగిన గ్యాస్ ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపాయి చమురు సంస్థలు.

రాష్ట్రంలో లీటర్  పెట్రోల్ పై 91 పైసలు, డీజిల్ పై 88 పైసలు పెంచారు. దీంతో హైదరాబాద్ లో లీటర్  పెట్రోల్  109 రూపాయల 10 పైసలు, డీజిల్  95 రూపాయల 40 పైసలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్  96 రూపాయల 21 పైసలు, డీజిల్ 87 రూపాయల 47 పైసలకు పెరిగింది. ముంబయిలో పెట్రోల్ కు 110 రూపాయల 82 పైసలు, డీజిల్ కు 95 రూపాయలుగా ఉంది. కోల్ కతాలో పెట్రోల్ కు 105 రూపాయల 51 పైసలు, డీజిల్ కు 90 రూపాయల 62 పైసలు కాగా.. చెన్నైలో పెట్రోల్ కు 102  రూపాయల 16 పైసలు, డీజిల్ కు 92 రూపాయల 19 పైసలకు పెరిగింది. విశాఖపట్నంలో  పెట్రోల్ 109 రూపాయల 30 పైసలు, డీజిల్ 95 రూపాయల 41 పైసలకు చేరింది.

గతేడాది నవంబర్ తర్వాత పెట్రో ధరలు పెరగడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కారణంగా ఇటీవల అంతర్జాతీయంగా క్రూడ్  ఆయిల్  ధరలు గరిష్టానికి చేరుకున్నాయి. అయితే రోజురోజుకు చమురు సంస్థల నష్టాలు పెరుగుతుండడంతో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం అనివార్యంగా మారినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలకు ముందు భారత్ లో చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పై 10 రూపాయలు, డీజిల్ పై 5 రూపాయల చొప్పున ఎక్సైజ్  సుంకాన్ని తగ్గించింది. కేంద్రాన్ని అనుసరించి పలు రాష్ట్రాలు సైతం వ్యాట్ ను తగ్గించడంతో వినియోగదారులకు భారీ ఊరట లభించింది. తెలుగు రాష్ట్రాలు మాత్రం వ్యాట్ ను తగ్గించలేదు.