ఏడేండ్లలో పెట్రోల్‎పై రూ. 32, డీజిల్‎పై రూ. 41 పెంపు

ఏడేండ్లలో పెట్రోల్‎పై రూ. 32, డీజిల్‎పై రూ. 41 పెంపు

దేశంలో పెట్రో రేట్ల పెంపు కొనసాగుతోంది. నేడు లీటర్ పెట్రోల్, డీజిల్ పై 35 పైసల చొప్పున పెంచాయి చమురు కంపెనీలు. హైదరాబాద్‎లో లీటర్ పెట్రోల్ 110 రూపాయల 9 పైసలకు, డీజిల్ 103 రూపాయల 18 పైసలకు చేరింది. ఢిల్లీలో పెట్రోల్ 105 రూపాయల 84 పైసలకు, డీజిల్ 94 రూపాయల 57 పైసలకు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ 111 రూపాయల 77 పైసలు, డీజిల్ 102 రూపాయల 37 పైసలకు చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ 109 రూపాయల 53 పైసలు, డీజిల్ 100 రూపాయల 37 పైసలకు పెరిగింది. ఈ నెలలో లీటర్ పెట్రోల్ పై 4 రూపాయల 43 పైసలు, డీజిల్ పై 5 రూపాయల 11 పైసలు పెరిగింది.  

రోజూ పెట్రో, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. దాదాపు 5 నెలల్లో పెట్రోల్ మీద 11 రూపాయలకు పైగా పెరిగింది. డీజిల్ పై 10 రూపాయల దాకా పెరిగింది. 2014లో మే 13న హైదరాబాద్‎లో లీటర్ పెట్రోల్ 78 రూపాయలు, డీజిల్ ధర 61 రూపాయల 80 పైసలుగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‎లో లీటర్ పెట్రోల్ 110 రూపాయల 9పైసలకు, డీజిల్ 103 రూపాయల 18 పైసలకు చేరింది. అంటే లీటర్ పెట్రోల్ పై 32 రూపాయలు, డీజిల్ 41 రూపాయలు పెరిగింది.

పెట్రో రేట్ల ధరల పెరుగుదల సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు పెరుగుతున్నాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతున్నాయి. పాలు, కూరగాయల ధరలు కూడా సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.