
- అడ్మిషన్లకు ముగిసిన గడువు
- జాబ్ ఓరియంటెడ్ కోర్సులు, ప్లేస్‌మెంట్స్‌తో యువతలో పెరిగిన నమ్మకం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ల (ఏటీసీ)లో అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వచ్చే నెల నుంచి మొదలుకానున్న కోర్సులకు అడ్మిషన్ల గడువు శనివారంతోనే ముగిసింది. తొలి విడత నోటిఫికేషన్‌కు మంచి స్పందన వచ్చింది.
57 ఏటీసీల్లో వంద శాతం ఫుల్
రాష్ట్రంలో మొత్తం 64 ఏటీసీలు ఉండగా.. 57 ఏటీసీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగతా 7 ఏటీసీల్లో సైతం 65 శాతానికి పైగా ఫిల్ అయ్యాయి. ఒక్కో ఏటీసీలో 172 సీట్ల చొప్పున మొత్తం 11,008 సీట్లు ఉండగా.. శనివారం వరకు 10,800 అడ్మిషన్లు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 98 శాతం సీట్లు భర్తీ అయినట్లు ఆఫీసర్లు తెలిపారు. మరో వైపు ఐటీఐ (ఇండస్ర్టియల్ ట్రైనింగ్ ఇన్స్‌స్టిట్యూట్)ల్లో 8,304 సీట్లు ఉంటే 92 శాతం 7,625 సీట్లు ఫిల్ అయ్యాయి. ఐటీఐల్లో కూడా ఎనిమిదో తరగతి అర్హతతోనే పలు కోర్సులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలు కలిపి సుమారు 300లకు పైగా ఉండగా.. ఇందులో 80 వేల వరకు సీట్లు ఉన్నాయి. త్వరలో బ్యుటీషియన్, మేకప్ కోర్సులు కూడా ప్రారంభించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలిదశలో ఆరు కోర్సులు
ఏటీసీల్లో ప్రధానంగా తొలి దశలో ఆరు కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటిలో ఇంజినీరింగ్, డిజైన్ టెక్నీషియన్ (ఏడాది కోర్సు), మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమిషన్ (ఏడాది), ఇండస్ట్రియల్ రోబోటిక్స్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ (ఏడాది), వర్చువల్ వెరిఫైర్ డిజైన్, మెకానిక్, ఎలక్ట్రిక్ వెహికల్, సీఎన్సీ మెకానిక్ ట్నెషియన్‌లో రెండేండ్ల కోర్సులు అందిస్తున్నారు.
వీటితో పాటు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, టర్నర్, కంప్యూటర్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అనలిస్ట్, మెషినిస్ట్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్‌మాన్ సివిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్ డ్రాఫ్ట్‌మాన్, మెకానిక్, వెల్డర్, హెల్త్ అండ్ సానిటరీ ఇన్స్‌పెక్టర్, కట్టింగ్, డ్రెస్ మేకింగ్ కోర్సులు కూడా అందిస్తున్నారు.
మంచి వేతనంతో ప్లేస్‌మెంట్స్
ఏటీసీలు, ఐటీఐల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి వేతనంతో ప్లేస్‌మెంట్స్ దొరుకుతున్నాయి. ప్రభుత్వ ఏటీసీలో ట్రైనింగ్ తీసుకున్న వారిని టీకేఐల్ ఇండస్ట్రీస్, కోకాకోలా, టయోట, ఎంఆర్‌ఎఫ్, మారుతి, జేవియర్, మేధా సర్వస్ డ్రైవ్స్, రాణి ఇంజన్ వాల్స్ వంటి కంపెనీలు రిక్రూట్ చేసుకుంటున్నాయి. వీరికి ప్రారంభ వేతనం రూ. 20 వేలు ఉంటుండగా... రెండు, మూడేండ్లలో రూ. 60 వేల కంటే ఎక్కువే జీతం తీసుకుంటున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. మరికొందరు కొన్నేళ్లు ఉద్యోగాలు చేసిన తర్వాత సొంతంగా చిన్న చిన్న కంపెనీలు ప్రారంభించి ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు.