వర్సిటీల క్యాంపస్ సీట్లకు మస్త్ డిమాండ్

 వర్సిటీల క్యాంపస్ సీట్లకు మస్త్ డిమాండ్
  • క్యాంపస్‌లోనే సదువుకుందాం
  • యూనివర్సిటీ పీజీ కాలేజీల్లో 97% సీట్లు ఫుల్  
  • పీజీ సెంటర్లలో 73%, అఫిలియేటెడ్ కాలేజీల్లో 64 % సీట్ల భర్తీ 
  • ఓయూ సీట్లకే ఎక్కువ డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో  పీజీ కోర్సుల్లో యూనివర్సిటీ క్యాంపస్సీట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది పీజీ సెంటర్లు, అఫిలియేటెడ్ కాలేజీలతో పోలిస్తే క్యాంపస్కాలేజీల్లోని సీట్లు ఎక్కువగా నిండాయి. క్యాంపస్ కాలేజీల్లో 97శాతం సీట్లు భర్తీకాగా, పీజీ సెంటర్లలో 73 శాతం, అఫిలియేటెడ్ కాలేజీల్లో 64 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అయితే స్టేట్లో ఏడు వర్సిటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల సీట్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల పరిధిలోని పీజీ సీట్ల భర్తీ కోసం సీపీగెట్–2020 నిర్వహించారు. ఆయా వర్సిటీల పరిధిలోని 320 కాలేజీల్లో 72 కోర్సుల్లోని 38,257 సీట్లకు 85,263 మంది అప్లై చేశారు. వీరిలో 72,467 మంది ఎగ్జామ్ రాయగా, 70,141 మంది క్వాలిఫై అయ్యారు. 44,850 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, 27,221 సీట్లు నిండాయి. మరో11,036 సీట్లు మిగిలాయి. వీటిలో క్యాంపస్ సీట్లకు మాత్రం పోటీ ఎక్కువగా కనిపించింది. 

క్యాంపస్‌లలో 97శాతం భర్తీ 
జేఎన్టీయూ, ఓయూ, కేయూ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు తదితర వర్సిటీల పరిధిలోని క్యాంపస్, కాన్ స్టిట్యూయెంట్ కాలేజీల్లో 6,621 సీట్లుంటే, 6,433 (97శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. 188 సీట్లు మాత్రమే మిగిలాయి. పెద్ద వర్సిటీలైన ఓయూలో 94, కేయూలో 26 క్యాంపస్ సీట్లు మాత్రమే మిగిలాయి. అయితే క్యాంపస్లో మిగిలిన సీట్లన్నీ డిప్లొమా కోర్సులు, ఉర్దూ, కన్నడ, మరాఠి తదితర మీడియంలోనివేనని అధికారులు చెప్తున్నారు. పీజీ సెంటర్లలో1,340 సీట్లుండగా, 985 (73 శాతం) నిండగా, 355 సీట్లు మిగిలాయి. ఆయా వర్సిటీల పరిధిలోని అనుబంధ కాలేజీల్లో 29,364 సీట్లుండగా, 18,908 సీట్లు భర్తీ అయ్యాయి.10,456 సీట్లు మిగిలాయి. క్యాంపస్ లలో కాలేజీ వాతావరణం బాగుండటంతో పాటు ఫీజు తక్కువగా ఉంటుందనే క్యాంపస్ సీట్లను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారని అధికారులు చెప్తున్నారు.  

ఓయూ పరిధిలో 82 శాతం భర్తీ 
సీపీగెట్ ద్వారా ఏడు వర్సిటీల పరిధిలోని పీజీ సీట్లను భర్తీ చేయగా, ఓయూ సీట్లకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఓయూ పరిధిలో 13,872 సీట్లుండగా, 11,259 (82 శాతం) భర్తీ అయ్యాయి.  2,613(18 శాతం) సీట్లు ఖాళీగా ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలో 96 సీట్లే ఉండగా, అన్నీ నిండాయి. కేయూలో 34 శాతం, మహాత్మాగాంధీలో 32 శాతం, పాలమూరులో 32 శాతం, శాతవాహనలో 37 శాతం, తెలంగాణ వర్సిటీలో 36 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి.  

ఫెసిలిటీస్ బాగుంటాయనే..  
పీజీ అడ్మిషన్లలో వర్సిటీ క్యాంపస్ సీట్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. క్యాంపస్ కాలేజీల్లో సీనియర్ ప్రొఫెసర్లు ఉండటం, పెద్ద లైబ్రరీ, హాస్టళ్లతో సహా అన్ని ఫెసిలిటీలు ఉంటాయి. దీనికితోడు ఫీజులూ తక్కువగా ఉండటంతో పాటు కాలేజీ వాతావరణం బాగుంటుంది. అందుకే టాపర్లతో సహా ఎక్కువ మంది క్యాంపస్ కాలేజీల్లో చదివేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు. 
- డాక్టర్ ఎన్.కిషన్, సీపీగెట్ కన్వీనర్