ఒకేషనల్​ కోర్సులకు మస్త్​ డిమాండ్

ఒకేషనల్​ కోర్సులకు మస్త్​ డిమాండ్

పారామెడికల్ వైపే ఇంటర్ స్టూడెంట్ల చూపు

మొత్తం 96 వేల సీట్లు.. పారామెడికల్ అడ్మిషన్లే 43 వేలు

అప్రెంటీస్ షిప్​వల్ల వచ్చే ఏడాది మరింత పెరగనున్న డిమాండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పారామెడికల్ కోర్సులకు డిమాండ్​పెరుగుతోంది. ఇంటర్​ఒకేషనల్ కోర్సుల్లో చేరే స్టూడెంట్లలో సగం మంది పారామెడికల్ కోర్సులకే మొగ్గు చూపుతున్నారు. కోర్సు పూర్తికాగానే ఉద్యోగాలు వస్తుండటంతో, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ కోర్సుల్లోనే చేరుతున్నారని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది నుంచి అప్రెంటిస్ షిష్ విధానం కూడా అమలు చేస్తుండటంతో, వచ్చే ఏడాది నుంచి అడ్మిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

577 కాలేజీల్లో 96 వేల సీట్లు

రాష్ర్టంలో 577 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో 22 ఒకేషనల్ ​కోర్సులు నడుస్తున్నాయి. వీటిలో మొత్తం 96,208 మంది చదువుతున్నారు. 176 సర్కారు కాలేజీల్లో 41,205 మంది, 401 ప్రైవేటు కాలేజీల్లో 55,003 మంది చదువుతున్నారు. ఒకేషనల్​కోర్సుల్లో పారామెడికల్ ​విభాగంలో ఫార్మా టెక్నాలజీ, మెడికల్ ల్యాబ్​ టెక్నిషియన్(ఎంఎల్టీ), ఫిజియోథెరపీ, మల్టీపర్పస్​హెల్త్​ వర్కర్ ఫిమేల్(ఎంపీహెచ్ డబ్ల్యూ), మరో నాలుగు కోర్సులున్నాయి. నాన్​పారామెడికల్ కోర్సుల్లో అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్, ఫిషరీస్, అకౌంటింగ్ ట్యాక్సేషన్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, కన్​స్ర్టక్షన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, మెకానికల్ టెక్నీషియన్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ వంటి కోర్సులున్నాయి.

రెండు కోర్సుల్లోనే..

పారామెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆయా కోర్సుల్లో ప్రస్తుతం 43,297 మంది చదువుతున్నారు. వీరిలో సెకండియర్ స్టూడెంట్స్19,549 మంది ఉంటే, ఫస్టియర్ స్టూడెంట్స్​23,748 మంది ఉన్నారు. వీటిలో మళ్లీ ఎంపీహెచ్ డబ్ల్యూ, ఎంఎల్టీ కోర్సులకే ఎక్కువ డిమాండ్ ఉంది. ఎంపీహెచ్ డబ్ల్యూలో 22,782 మంది స్టూడెంట్స్, ఎంఎల్టీలో19,250 మంది ఉన్నారు. ఇటీవల ఇంటర్ బోర్డు అధికారులు, ప్రముఖ హాస్పిటల్స్ మేనేజ్మెంట్లతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయా కోర్సుల విద్యార్థులకున్న డిమాండ్​ను అధికారులకు మేనేజ్మెంట్లు వివరించాయి. దీంతో మార్కెట్లోని డిమాండ్ కు అనుగుణంగా పారామెడికల్ లో వచ్చే విద్యాసంవత్సరం మరిన్ని కొత్త కోర్సులను తేవాలని ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకున్నది.

అప్రెంటిస్ షిప్ తో మరింత డిమాండ్..

కేంద్రం పరిధిలోని రీజినల్ డైరెక్టరేట్​ఆఫ్​ స్కిల్ ​డెవలప్మెంట్​అండ్​ఎంట్రప్రెన్యూర్షిప్​ (ఆర్డీఎస్డీఈ) తో అప్రెంటిస్ షిప్​ కోసం ఇంటర్ బోర్డు అధికారులు పలుమార్లు సమావేశమయ్యారు. ఇంటర్ లో నాలుగేండ్లుగా నిలిచిపోయిన అప్రెంటిస్ షిప్​ విధానం అమలుకు సహకరిస్తామని ఆ సంస్థ తెలిపింది. దీంతో ఏప్రిల్ లేదా మే నెలలో అప్రెంటిస్ షిప్​ మేళా నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. దీని ప్రభావం2020–21 అడ్మిషన్లపై పడుతుందని వారు చెప్తున్నారు. మరిన్ని కాలేజీల్లో ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్సు పూర్తికాగానే ఉద్యోగాలు దొరుకుతుండటం వల్లే ఈ కోర్సులకు డిమాండ్​పెరుగుతోందని పేర్కొంటున్నారు.