శివగంగ: శివగంగ జిల్లాలోని తిరుప్పువనమ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో భార్యాభర్త, వారి రెండేళ్ల పిల్లాడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. పోలీసు పెట్రోలింగ్ వాహనం బైక్ను ఢీకొట్టిన ఘటనలో రెండేళ్ల చిన్నారితో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన ముగ్గురిని మధురై జిల్లాలోని ఒథకడైకి చెందిన ప్రసాద్ (25), అతని భార్య సత్య (20), వారి రెండేళ్ల కొడుకు అశ్విన్గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనంజియూర్‌లో బంధువు తంగమ్మల్ అంత్యక్రియలకు వెళ్లి.. తిరిగి ఇంటికి బైక్ పై వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. ఈ ముగ్గురితో పాటు బైక్పై బంధువైన సెన్నై ఈశ్వరి (25) కూడా ఉన్నారు.
సక్కుడి ప్రాంతానికి వీరి బైక్ రాగానే.. ఒక పోలీసు పెట్రోలింగ్ వాహనం అదుపు తప్పి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన సత్య, పిల్లాడు అశ్విన్, ఈశ్వరిని.. తిరుప్పువనం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, సత్య, ఆమె కుమారుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. తీవ్రంగా గాయపడిన ఈశ్వరిని తదుపరి చికిత్స కోసం మధురై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక కుటుంబాన్ని బలిగొన్న ఈ విషాదకరమైన ప్రమాదం స్థానికులలో ఆగ్రహానికి కారణమైంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనమే ఇలా ప్రాణాలు తీయడంతో బాధిత కుటుంబ సభ్యుల్లో కోపం కట్టలు తెంచుకుంది.
ప్రసాద్ బంధువులు ప్రమాదం జరిగిన చోట ధర్నాకు దిగారు. ప్రమాదానికి కారణమైన పోలీసు కారు డ్రైవర్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో.. సక్కుడి-పూవంతి రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసు వాహనం అతి వేగంతో వచ్చి ఉండొచ్చని లేదా నిర్లక్ష్యంగా మద్యం తాగి పెట్రోలింగ్ వాహనం నడిపి ఉండవచ్చని ఆందోళనకు దిగిన బంధువులు ఆరోపించారు. డ్రైవర్‌ను అరెస్టు చేసే వరకు మృతదేహాలను తీసుకెళ్లేది లేదని నిరసనకు దిగారు. సమాచారం అందుకున్న శివగంగ ఎస్పీ శివ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని, సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నిరసనకారులతో చర్చలు జరిపారు. డ్రైవర్‌ను అరెస్టు చేస్తామని మరియు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. ప్రసాద్, సత్య, అశ్విన్ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మధురై ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు.
