ఇదేం ఖర్మరా బాబూ : ద్రవ్యోల్బణం తగ్గినా ప్రజలకు ఖర్చులు తగ్గట్లే.. ఎందుకంటే..?

ఇదేం ఖర్మరా బాబూ : ద్రవ్యోల్బణం తగ్గినా ప్రజలకు ఖర్చులు తగ్గట్లే.. ఎందుకంటే..?

అక్టోబర్ నెలలో దేశంలో చరిత్రాత్మక రీతిలో ద్రవ్యోల్బణం ఏకంగా 0.25 శాతానికి తగ్గింది. కానీ ఇది అందరికీ ఒకే తరహా ఊరటనివ్వలేకపోయింది. షాపింగ్ బిల్లులు చూస్తే.. ప్రతి కుటుంబం ఒక “స్ప్లిట్ స్క్రీన్” అనుభవం చూస్తోంది. ఈ క్రమంలో కొన్ని వస్తువుల రేట్లు చవకగా మారగా.. మరికొన్ని అవసరాల ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నట్లు తేలింది. దీంతో ద్రవ్యోల్బణం తగ్గినా గృహ ఖర్చుల విషయంలో రిలీఫ్ రాలేదని సగటు మధ్యతరగతి వేతన జీవి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఆహార పదార్థాల్లో విభిన్న ధోరణి స్పష్టంగా కనిపించింది. శీతాకాలం కూరగాయలైన పాలకూర, ముల్లంగి లాంటి ఆకుకూరలు రెండుశాతం వరకు పెరిగాయి. సీజన్ ఫేవరెట్ అయిన బఠాణీలు 12 శాతానికి పైగా పెరుగుదలను చూశాయి. అలాగే మాంసం, గుడ్ల ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. అయితే పండ్ల రేట్లు మాత్రం విభిన్నంగా ఉన్నాయి.. అనాసపండు 6.1 శాతం పెరిగినా, ఆపిల్ ధర దాదాపు 10 శాతం పడిపోయి ప్రజలకు తాత్కాలిక ఉపశమనం ఇచ్చింది.

వంటనూనెలు మాత్రం బలమైన రేట్ల తగ్గింపులను అందించాయి. ఆవాలు, వేరుశనగ నూనెలతో పాటు రిఫైన్డ్ ఆయిల్స్ కూడా స్వల్పంగా తగ్గాయి. దీంతో ఏడాది పొడవునా ధర తగ్గింపు ధోరణిని కొనసాగించాయి. ఇదే క్రమంలో చక్కెర ధరలు పెద్దగా మారలేదు. కాఫీ, టీ రేట్లు కూడా స్థిరంగానే ఉన్నాయి.

పర్సనల్ కేర్ వస్తువులు తగ్గలే..
షాంపూ, హెయిర్ ఆయిల్, బ్యూటీ పార్లర్ సర్వీసులు స్వల్పంగా పెరిగాయి. 0.3 శాతం పెరుగుదల చిన్నదిగా కనిపించినప్పటికీ.. నెలవారీ ఖర్చులు పెరుగుతున్న అనుభూతికి కూడా కారణమవుతోంది.

డ్యూరబుల్ వస్తువుల పరిస్థితి..
కార్ల రేట్లు 6.9 శాతం, టూవీలర్ల ధరలు 4.5 శాతం పడిపోయాయి. జీఎస్టీ రేటు తగ్గింపుతో వినియోగదారులకు మంచి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇక టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఫ్రీజర్లు కూడా చవకగా మారాయి. అయితే బంగారం 12.5 శాతం, వెండి 21.7 శాతం పెరిగి ఆభరణాల ఖర్చులు మళ్లీ భారీగా పెరిగాయి.

ఇంటి అద్దెలు.. కరెంట్ బిల్లుల పరిస్థితి..
ఇళ్ల అద్దెలు 0.9 శాతం పెరగగా, విద్యుత్.. ఎల్పీజీ ధరలు యథాతథంగా ఉన్నాయి. గృహ సహాయక సేవలు, రిపేర్ల ఖర్చులు మాత్రం నెమ్మదిగా మెరుగుపడి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మసకబార్చాయి.

మెుత్తానికి చెప్పుకోవటానికి ద్రవ్యోల్బణం చరిత్రాత్మకంగా అత్యల్పాలకు తగ్గినా.. ప్రజల రోజువారీ జీవితాల్లో ఆ ఉపశమనం సమానంగా పంచబడలేదని గణాంకాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. రేట్ల తగ్గుదలతో పరిస్థితులు ఒకపక్క ఉపశమనం కలిగించినప్పటికీ మరోపక్క మెల్లమెల్లగా పెరుగుతున్న రేట్లు తమకు ఎలాంటి బెనిఫిట్ ఇవ్వటం లేదని ప్రజలు వాపోతున్నారు.