- భీమన్న గుడిలో కోడె మొక్కులకు ఏర్పాట్లు
- ఇవాళ (నవంబర్ 12, 2025) తెల్లవారు జాము నుంచి అమల్లోకి
- చురుకుగా ఆలయ అభివృద్ధి పనులు
వేములవాడ: దక్షిణ కాశీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇవాళ వేకువజాము నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో.. భక్తులు ఆలయంలోకి ప్రవేశించకుండా ముందు భాగంలోని ప్రధాన గేటు వద్ద ఇనుప రేకులను అమర్చారు. ఆలయం చుట్టూ పలు ప్రాంతాలలో భక్తులు లోనికి రాకుండా ఇప్పటికే ఇనుప రేకులు అమర్చారు. భక్తుల దర్శనాల నిమిత్తం ఆలయం ముందు భాగంలో స్వామివారి ప్రచార రథం వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు.
భీమేశ్వరాలయంలో భక్తుల దర్శనాలతో పాటు కోడె మొక్కలు ఆర్జిత సేవలను ఇప్పటికే ప్రారంభించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా సుమారు నెల రోజుల నుంచి ఆలయ పరిసరాలలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దక్షిణం, ఉత్తర భాగాలలో ప్రాకారం.. పడమర వైపు ఉన్న నైవేద్యశాల, ఆలయ ఈవో కార్యాలయం ఇప్పటికే తొలగించారు. ఈ క్రమంలో తాజాగా ఇవాళ తెల్లవారుజామున మెయిన్ గేట్‌ను ఇనుప రేకులతో మూసివేశారు.
