టెంపుల్స్​లో ఫుల్ రష్.. కొద్ది రోజుల్లో ముగియనున్న సమ్మర్ హాలీడేస్

టెంపుల్స్​లో ఫుల్  రష్.. కొద్ది రోజుల్లో ముగియనున్న సమ్మర్ హాలీడేస్
  •      యాదాద్రి, వేములవాడ, భద్రాచలం, తిరుపతి అన్ని చోట్లా ఇదే రద్దీ
  •      దర్శనానికి గంటలకొద్దీ సమయం 
  •      పార్కింగ్​కు ఇబ్బందులు పడుతున్న భక్తులు

హైదరాబాద్, వెలుగు:  సమ్మర్ హాలీడేస్ ముగింపుకు చేరుకోవడంతో గత కొద్ది రోజులుగా రాష్ట్రంలోని అన్ని టెంపుల్స్ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి గంటల టైమ్ పడుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాంతాల నుంచి ప్రముఖ టెంపుల్స్ కు వెళ్లేందుకు బస్ జర్నీ తీవ్ర ఇబ్బందిగా మారడటంతో ప్రైవేటు వెహికల్స్ లో వెళుతున్నారు. దీంతో గుళ్ల దగ్గర పార్కింగ్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ టెంపుల్స్ లో ఇదే పరిస్థితి నెలకొంది. భద్రాచలం, చిలుకూరు బాలాజీ, వేములవాడ, యాదగిరిగుట్ట, కొండగట్టు, ఏడుపాయల టెంపుల్, బాసర, ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్స్ లో భక్తుల రద్దీ నెలకొంది. హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. హనుమాన్ మాలలు ధరించిన భక్తులు భారీ సంఖ్యలో వస్తుండటంతో వచ్చే నెల వరకు ఇదే పరిస్థితి ఉండనుందని అధికారులు చెబుతున్నారు.  యాదాద్రిలో భక్తుల సాధారణ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, స్పెషల్ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

కోరికలు నెరవేర్చాలని మొక్కులు 

రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు త్వరలోనే స్టార్ట్ కానున్నాయి. ప్రతిష్టాత్మక కాలేజీలు, యూనివర్సిటీల్లో సీట్లు సాధించాలని స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు తమ ఇష్టదైవాలను ప్రార్థిస్తున్నారు. కోరికలు నెరవేర్చాలని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అకడమిక్ ఇయర్ స్టార్ట్ అయితే తీరిక దొరకదని ఎక్కువ సంఖ్యలో దేవాలయాలకు వస్తున్నారు. 

భక్తులతో తిరుమల కిటకిట

తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. దర్శనానికి దాదాపుగా 30 గంటల సమయం పడుతోంది. క్యూలైన్లు అన్ని నిండిపోవడంతో రోడ్ల మీద వరకు భక్తులు బారులు తీరారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని రోజుకు సగటున 90 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీకెండ్ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. 

రద్దీకి అనుగుణంగా చర్యలు: 

సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో భక్తుల రద్దీ పెరిగింది. సాధారణ రోజుల్లో  8వేల లోపు మంది వస్తుండగా హాలిడేస్ స్టార్ట్ అయ్యాక, వీకెండ్ లో 20 వేల మంది వరకు భక్తులు వస్తున్నారు. దర్శనానికి సుమారు గంటన్నర టైమ్ పడుతుంది. భక్తులు ఇబ్బందులు పడకుండా క్యూలైన్లలో మజ్జిగ సరఫరా చేస్తున్నాం. ఎండ నుంచి భక్తులు ఉపశమనం పొందేందుకు జీఎంఆర్ కంపెనీ సహాకారంలో కోటి 20 లక్షలతో ఎల్ ఆకారంలో షెడ్ ఏర్పాటు చేశాం. ప్రతి రోజు 30వేల లడ్డూలను అందుబాటులో ఉంచాం. భక్తులకు ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా గుడికి దగ్గర్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం.    
‑ రమాదేవి, ఈవో, భద్రాచలం