శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

శబరిమల ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

శబరిమల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు, అయ్యప్ప స్వాములు శబరిమలకు భారీగా తరలివస్తున్నారు. పంబా ప్రాంతమంతా అయ్యప్ప నామస్మరణతో మార్మోగుతోంది. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతివ్వటంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అయ్యప్పస్వాములు స్వామివారిని దర్శించుకొని మాల విరమణ చేస్తున్నారు.

దర్శనం వేళలలో మార్పులు 

శబరిమలకు భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు దర్శనం వేళలలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. భక్తుల రద్దీ పెరగడంతో పాటు కరోనా ఆంక్షలు లేకపోవడంతో రెండో భాగంలో దర్శన సమయాన్ని మార్చారు.

ఇక నుంచి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకే స్వామి వారి దర్శనం కల్పించనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 16న శబరిమల ఆలయం తెరవగా.. సోమవారం వరకు 3 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చినట్టు చెప్పారు. సోమవారం ఒక్కరోజే 70 వేల మంది భక్తులు వచ్చారని పేర్కొన్నారు.