
- రేపు ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం వద్ద ప్రారంభం
- తాడ్‌బండ్ వీరాంజనేయ ఆలయం వరకు 12 కి.మీ మేర కొనసాగనున్న యాత్ర
- 10 వేల మంది పోలీసులతో బందోబస్తు.. 850 కెమెరాలతో నిఘా
హైదరాబాద్, వెలుగు: హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం నిర్వహించే విజయ శోభాయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.10 వేల మంది పోలీసులు, 850 సీసీటీవీ కెమెరాలు, మౌంటెడ్ కెమెరాలు, మఫ్టీ పోలీసులతో పటిష్టమైన నిఘా పెట్టారు. ట్రాఫిక్ రూట్‌మ్యాప్ ను రూపొందించారు. రేపు ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర మొదలై.. రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ తాడ్‌బండ్ వీరాంజనేయ ఆలయం వద్ద ముగియనుంది.
మొత్తం12 కి.మీలు జరగనున్న శోభాయాత్రకు కర్మన్‌ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గరి నుంచే కాకుండా సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్స్, బారికేడ్లు ఏర్పాట్లు చేశారు. శోభాయాత్రను ప్రశాంతంగా పూర్తి చేయాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్స్ అమల్లో ఉంటాయని తెలిపారు.
గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు ఇలా..
గౌలిగూడ రామమందిర్ వద్ద మొదలయ్యే యాత్ర -పుత్లిబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రా బ్యాంక్ క్రాస్ రోడ్స్, కోఠి, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి క్రాస్ రోడ్స్,ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, గాంధీనగర్, కవాడిగూడ సీజీవో టవర్స్,- బన్సీలాల్ పేట్ రోడ్,- బైబిల్ హౌస్,- సిటీ లైట్ హోటల్, బాటా షో రూం, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రాంగోపాల్‌పేట పీఎస్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, సీటీవో జంక్షన్, ఇంపీరియల్ గార్డెన్ మీదుగా వెళ్లి తాడ్ బండ్ వీరాంజనేయ ఆలయం వద్ద ముగుస్తుంది.
మద్యం దుకాణాలు బంద్
గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు జంట నగరాల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ పోలీసులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. గ్రేటర్ పరిధిలోని మద్యం షాప్‌లు, పబ్‌లు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.
కర్మన్‌ఘాట్ నుంచి శోభాయాత్ర
కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ నుంచి మొదలయ్యే యాత్ర చంపాపేట, ఐఎస్ సదన్, ధోబీ ఘాట్, మలక్‌పేట, సైదాబాద్ కాలనీ రోడ్, శంకేశ్వర్ బజార్, సరూర్ నగర్ ట్యాంక్, రాజీవ్ గాంధీ విగ్రహం, దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్ జంక్షన్,-మలక్‌పేట, నల్గొండ క్రాస్ రోడ్స్, అజంపురా రోటరీ, చాదర్‌ఘాట్ క్రాస్ రోడ్స్ మీదుగా కోఠి విమెన్స్ కాలేజ్ జంక్షన్ వద్ద గౌలిగూడ నుంచి వచ్చే ప్రధాన శోభాయాత్రలో కలుస్తుంది. ఈ రెండు రూట్లలో శోభాయాత్రకు అనుగుణంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయనున్నారు.
శోభాయాత్రకు హాజరయ్యే భక్తుల వెహికల్స్ మినహా మిగతా వాటిని ఈ రూట్ లో అనుమతించమని సిటీ సీపీ ఆనంద్ తెలిపారు. వాహనదారులు ఇతర మార్గాల్లో ప్రయాణించాలని బారికేడర్లు, సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాన శోభాయాత్రను పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి తెచ్చామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించినట్లు ఆయన తెలిపారు.