భూదందాలు, సెటిల్​మెంట్లకు ఫుల్​సపోర్ట్​

 భూదందాలు, సెటిల్​మెంట్లకు ఫుల్​సపోర్ట్​

హనుమకొండ, వెలుగు : గ్యాంగ్ స్టర్​ నయీం చనిపోయి ఐదేండ్లవుతున్నా అతడి అనుచరుల ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వరంగల్​ఉమ్మడి జిల్లాలో వివాదాస్పద భూములపై కన్నేయడం, సెటిల్​మెంట్లు చేస్తామంటూ దందాలకు దిగడం, లొంగని వారిని తుపాకులు, తల్వార్లతో బెదిరించడం కామనైపోయింది. అయితే వీరి వెనక అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్టు స్పష్టమవుతున్నది. వీరి అండ చూసుకుని గ్యాంగ్​సభ్యులు మరింత రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని నెలల కింద కొంతమంది బాధితులు ధైర్యంగా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు జులై 29న ఓ ముఠాను పట్టుకుని విచారణ మొదలుపెట్టారు. వారి ఎంక్వైరీలో విస్తుగొలిపే నిజాలు బయటపడుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు నయీం గ్యాంగ్​తో భూదందాల్లో పాల్గొన్న అధికార పార్టీ నేతల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికీ ఇద్దరు టీఆర్ఎస్​ నేతలను అరెస్ట్​ చేయగా.. మరికొందరిపైనా యాక్షన్​ తీసుకునేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు.

మూడేండ్ల నుంచి దందా

రాష్ట్ర రాజధాని హైదరాబాద్​తర్వాత అభివృద్ధికి అంత అవకాశం ఉన్న నగరం వరంగల్. ఓ వైపు రింగ్​ రోడ్డు, మరోవైపు వివిధ పరిశ్రమలు, కంపెనీలు, విద్యాసంస్థలు, ఐటీ ఇండస్ట్రీ ఇలా అన్నీ ఇక్కడే ఏర్పాటవుతుండటంతో భూములకు డిమాండ్​ పెరిగింది. ఒక్కసారిగా భూముల రేట్లు ఆకాశాన్నంటడం,  ధరణి వెబ్​సైట్​లో దొర్లిన తప్పుల కారణంగా భూవివాదాలు  ఎక్కువ కాగా ఇదే సందనుకుని సెటిల్​మెంట్​ గ్యాంగులు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మూడేండ్ల కిందటే నయీం గ్యాంగ్​లో పని చేసిన కొందరు ముఠాగా ఏర్పడి సెటిల్​మెంట్లు మొదలుపెట్టారు. ములుగు జిల్లాలో పోలీస్ రిజర్వ్​ఇన్​స్పెక్టర్​ గా పని చేస్తున్న సంపత్​ కుమార్​, నయీం గ్యాంగ్​ లో పని చేసిన ముద్దసాని వేణుగోపాల్​తో అధికార పార్టీ లీడర్, మొగుళ్లపల్లి మాజీ ఎంపీపీ మల్లయ్య, ఉమ్మడి జిల్లాకు చెందిన ఇంకొందరు నేతలు చేతులు కలిపారు. సెటిల్​మెంట్లు, బెదిరింపుల సంగతి వేణుగోపాల్, ఇంకొంతమందితో కూడిన గ్యాంగ్​ చూసుకుంటే..పోలీసులు, ఇతర ఆఫీసర్ల సపోర్ట్ ను కూడగట్టే పనిని ఆర్​ఐ సంపత్​కుమార్​ చూసుకునేవారు. ఇక్కడ కూడా వర్కవుట్​కాకపోతే మిగతా చోట్ల సెటిల్ చేసే పనిని అధికార పార్టీ లీడర్లు చూసుకునేవారు. ఇలా ఓ ప్లాన్​ప్రకారం మూడేండ్ల నుంచి దందాలు, సెటిల్ మెంట్లు చేస్తూ రూ.కోట్లు సంపాదించారు. ఈ క్రమంలో వరంగల్ ఆరెపల్లి సమీపంలోని ఓ ల్యాండ్ విషయంలో బాధితుడిని తుపాకీ, తల్వార్లతో బెదిరించడంతో ఈ గ్యాంగ్​బండారం బట్టబయలైంది.

అందరూ గులాబీ లీడర్లే..  

రూ. కోట్ల విలువైన ల్యాండ్​విషయంలో నయీం గ్యాంగ్​, ఆర్​ఐ సంపత్​ తుపాకులతో బెదిరింపులకు దిగడంతో ఓ బాధితులు ధైర్యం చేసి హసన్​పర్తి, కేయూ, హనుమకొండ పోలీస్​స్టేషన్లలో కేసు పెట్టారు. మొత్తం10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు జూలై 29న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.  తర్వాత ఆగస్టు 20న ఏ2 అయిన ఆర్ఐ సంపత్​ కుమార్​, ఈ నెల 12న ఏ1 ముద్దసాని వేణుగోపాల్​ ను అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారంతో ఏ3గా ఉన్న మాజీ ఎంపీపీ మల్లయ్యను, రెండు రోజుల కింద టీఆర్​ఎస్​ నల్లబెల్లి మండల అధ్యక్షుడు బానోత్​సారంగపాణిని అరెస్ట్ చేశారు. వీరే కాకుండా ఓ జడ్పీటీసీ, హసన్​పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన లీడర్, వరంగల్​నగరం వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన ఓ కార్పొరేటర్​ భర్త, ఇంకొంతమంది టీఆర్​ఎస్​ నాయకులు కూడా నయీం గ్యాంగ్​బాగోతాల్లో భాగం పంచుకున్నట్లు తెలిసింది.

మంత్రి, ప్రజాప్రతినిధి, ముగ్గురు ఎమ్మెల్యేలు 

నయీం గ్యాంగ్​తో ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు పర్సంటేజీలు మాట్లాడుకుని సపోర్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ గ్యాంగ్ బెదిరింపులతో కొంతమంది బాధితులు పోలీసులను ఆశ్రయించగా ఓ మంత్రితో పాటు సీఎంకు దగ్గరగా ఉండే ఓ ప్రజాప్రతినిధి, ఓ ముగ్గురు ఎమ్మెల్యేల సపోర్ట్​చేయడంతో యాక్షన్​ తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఓ బాధితుడు టాస్క్​ఫోర్స్​ తో పాటు వరంగల్ సీపీ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయం లీడర్లకు తెలియక సైలెన్స్ గా ఉన్నట్టు తెలిసింది. సీపీ వెంటనే ఆదేశాలివ్వడంతో పోలీసుల విచారణలో టీఆర్ఎస్​ లీడర్ల పేర్లు బయటకు వచ్చాయి. అయితే ఆలస్యంగా గుర్తించిన సదరు లీడర్లు ఇప్పుడు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొదట అరెస్ట్ చేయడానికి ఓ లీడర్​ దగ్గరకు వెళ్లగా ఆయన ముందస్తు బెయిల్​తీసుకున్నారు. ఈయనతో పాటు భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ నేత, మంత్రి కలిసి టీఆర్ఎస్​ లీడర్లను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

నేతల్లో కంగారు

నయీం గ్యాంగ్​కేసులో నిందితుల పేర్లు ఒక్కొక్కటిగా బయటపడుతుండగా.. ఆ బ్యాచ్​తో సంబంధం ఉన్న నేతల్లో కంగారు మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎంక్వైరీలో తమ పేర్లు బయటకు రాకుండా లీడర్లను ప్రసన్నం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ముద్దసాని వేణుగోపాల్, ఆర్ఐ సంపత్​కుమార్​తో అంటకాగిన కొందరు నేతలు ఓ ఎమ్మెల్యే ను ఆశ్రయించి, తమ పేరు బయటకు రాకుండా చూడాలని వేడుకున్నట్లు తెలిసింది. దీంతో ఆయా నేతలు కూడా వారిని కాపాడేందుకు ఎంక్వైరీ ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తునట్టు వినికిడి. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ గ్యాంగ్​బాధితులు పదుల సంఖ్యలో ఉండగా..  అధికార పార్టీ నేతలు నిందితులుగా ఉండడంతో కేసు విచారణపై అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలను తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆఫీసర్ల విచారణ పూర్తిగా సాగుతుందో.. లేదా మధ్యలోనే వీగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.