పెట్రోల్ బంకుల ఎఫెక్ట్.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్స్

పెట్రోల్ బంకుల ఎఫెక్ట్.. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ జామ్స్

పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ అలా ఇలా లేదు.. ప్రతి వాహనదారుడు ఇప్పుడు బంక్ వైపు పరుగులు పెడుతున్నాడు. బంకుల్లో పెట్రోల్ అయిపోతే.. రేపటి నుంచి పరిస్థితి ఏంటీ అనే ఆందోళనతో.. బైక్స్, కార్లు, ఆటోలు, బస్సులు ఇలా ప్రతి ఒక్కరూ బంక్ వైపు వెళుతున్నారు. దీంతో హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ విపరీతంగా పెరిగింది. కిలోమీటర్ల కొద్దీ క్యూలు.. మామూలుగా సిటీలో ట్రాఫిక్ జామ్స్ తో ఉంటాయి.. అలాంటిది ప్రతి పెట్రోల్ బంకు దగ్గర బైక్స్, కార్లు వందల సంఖ్యలో క్యూలో ఉండటంతో.. ట్రాఫిక్ నిలిచిపోతుంది.

కేంద్రం మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు ధర్నా చేపట్టాయి. దీంతో  సిటీలోని  పలు పెట్రోల్ బంకుల వద్ద ఎంట్రీ క్లోజ్ అంటూ నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో వాహనదారులు బంకుల వద్ద క్యూ కట్టారు. దీని ఎఫెక్ట్ సిటీలోని ట్రాఫిక్ పైన పడింది.  

 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, 3, లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  రోడ్ నెంబర్ 3 లో ఉన్న ఐఓసి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కోసం వాహానదారుల భారీగా క్యూ లైన్ లో ఉన్నారు. ఇక  ఖైరతాబాద్ నుంచి లక్డీకపూల్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది.  మెహదీపట్నం నుంచి లక్డీకపూల్ వెళ్లే మార్గంలోనూ ట్రాఫిక్ స్తంభించింది . దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  నెమ్మదిగా వాహనాలు ముందుకు కదులుతున్నాయి.  పోలీసులు ఎంట్రీ ఇచ్చి ట్రాఫిక్ ను కంట్రోల్ చేసినప్పటికీ అదుపులోకి రావడం లేదు.  మరోవైపు పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దీంతో ట్యాంకర్లు యథావిధిగా నడుస్తున్నాయి.