
- కానీ ప్రస్తుతం ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు.
- భారత్‌తో అమెరికాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది
దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు - భారత్‌పై విధించిన 50శాతం టారిఫ్‌లు నిజంగా ఎక్కువే
- ఇండియా సహా అన్ని దేశాలతో వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని వెల్లడి
- ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నా: మోదీ
వాషింగ్టన్: టారిఫ్‌ల వేళ భారత్– అమెరికా సంబంధాలు దెబ్బతినగా.. ట్రంప్ దీనిపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ గొప్ప ప్రధాని అని కొనియాడారు. ఆయనతో తానెప్పుడూ స్నేహంగానే ఉంటానని చెప్పారు. భారత్, రష్యాలకు దూరమయ్యాం అంటూ ట్రూత్ సోషల్‌లో శుక్రవారం ట్రంప్ పెట్టిన పోస్టుపై మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించారు. భారత్–అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉన్నదని తెలిపారు. మోదీతో తన స్నేహం ఎప్పటికీ అలాగే ఉంటుందని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. కానీ, ప్రస్తుతం మోదీ చేస్తున్న పనులే తనకు నచ్చడంలేదని ట్రంప్ అన్నారు.
ఆయిల్ కొనుగోలు వ్యవహారమే..
రష్యా నుంచి భారత్ పెద్ద మొత్తంలో క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నదని ట్రంప్ పేర్కొన్నారు. అది తనను చాలా నిరాశకు గురిచేసిందని చెప్పారు. ఇదే విషయాన్ని భారత్‌కు తెలియజేశానని, అక్కడి ఆయిల్ కొనుగోలు చేయొద్దని వారించానన్నారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశ దిగుమతులపై పెద్ద మొత్తంలో టారిఫ్‌లు కూడా విధించానన్నారు. తాను విధించిన 50 శాతం సుంకాలు నిజంగా చాలా ఎక్కువేనని ట్రంప్అంగీకరించారు. ‘‘నేను మోదీతో చాలా బాగా కలిసిపోతాను. అది మీకు కూడా తెలుసు. ఆయన 2 నెలల క్రితం ఇక్కడ ఉన్నారు. మేం రోజ్ గార్డెన్‌లో విలేకరుల సమావేశం కూడా నిర్వహించాం” అని చెప్పారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయిన
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపలేకపోయానని, అది తన ఫెయిల్యూరే అని ట్రంప్ ఒప్పుకున్నారు. తన హయాంలో తాను చూసిన అత్యంత కష్టమైన సంఘర్షణ రష్యా, ఉక్రెయిన్ దేనని చెప్పారు. వైట్ హౌస్‌లోని ఆధునీకరించిన రోస్ గార్డెన్‌లో యూఎస్ కాంగ్రెస్ సభ్యులకు శనివారం ట్రంప్ డిన్నర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తనకు సత్సంబంధాలు ఉన్నా.. ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపలేకపోయానన్నారు. కానీ, గడిచిన ఏడు నెలల్లో తాము చేసింది ఇంకెవరూ చేయలేదన్నారు. ఏడు నెలల్లో తాము ఏడు యుద్ధాలు ఆపానని పేర్కొన్నారు. ‘‘గతంలో జరిగిన యుద్ధాల్లో ఒకటి 31 ఏండ్లు కొనసాగింది. ఆపడం అసాధ్యమన్న ఆ యుద్ధాన్ని నేను 2 గంటల్లో ఆపాను” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
వ్యూహాత్మక భాగస్వామ్యం: మోదీ
భారత్‌తో అమెరికాకు ప్రత్యేక అనుబంధం ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ట్రంప్వ్యాఖ్యలను తాను అభినందిస్తున్నట్టు చెప్పారు. ట్రంప్ సానుకూల వైఖరిని ప్రశంసిస్తూ ‘ఎక్స్’ లో మోదీ పోస్ట్ పెట్టారు. ‘‘భారత్ – అమెరికా సంబంధాలపై ట్రంప్ భావాలు, సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నా. ఇరు దేశాలు మంచి భవిష్యత్తు, సానుకూల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’’ అని మోదీ పేర్కొన్నారు.
సుంకాలకు మినహాయింపులు
తన వాణిజ్య విధానంలో కొన్ని కీలక మార్పులు చేస్తూ ట్రంప్ శుక్రవారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ మార్పులు "జాతీయ అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరం" అని పేర్కొన్నారు. అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న దేశాలకు మొత్తం 45 రకాల వస్తువులపై జీర్ టారిఫ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. సోమవారం నుంచి అమల్లోకి రాబోతున్న మార్పుల ప్రకారం.. గ్రాఫైట్, టంగ్‌స్టెన్, యురేనియం, బంగారం సహా మొత్తం 45 రకాల లోహాలు, వస్తు ఉత్పత్తులను సుంకాల నుంచి మినహాయించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికా, ఇతర దేశాల మధ్య ఒప్పందాల అమలులో వేగం పెరగనుంది. విమాన విడి భాగాలు, జెనెరిక్ ఔషధాలు, దేశంలో ఉత్పత్తి కాని సుగంధ ద్రవ్యాలు, కాఫీ, అరుదైన లోహాలపై సుంకాలను తొలగించడం సులభం అవుతుంది.