రోడ్ల రిపేర్లకు నిధులేవి? వర్షాలతో రోడ్లు, బ్రిడ్జిలు డ్యామేజ్

రోడ్ల రిపేర్లకు నిధులేవి? వర్షాలతో రోడ్లు, బ్రిడ్జిలు డ్యామేజ్
  • రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల నష్టం 
  • మరమ్మతులకు ప్రపోజల్స్ పంపిన ఆఫీసర్స్ 
  • అసెంబ్లీలోనూ 60 మంది ఎమ్మెల్యేల ప్రస్తావన   
  • ఫండ్స్ పై ఇంతవరకు స్పందించని రాష్ట్ర సర్కార్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖలు నిర్మించిన రోడ్లు, బ్రిడ్జిలు భారీగా దెబ్బతిన్నాయి. రెండు శాఖల  పరిధిలో రూ.2 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న రోడ్లకు  తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల కోసం ఎంత ఖర్చు అవుతుందన్న పూర్తి వివరాలను జిల్లాల వారీగా ఆఫీసర్స్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. నివేదిక అంది 45 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిధులను విడుదల చేయలేదు. త్వరలో ఎన్నికలు ఉన్నందున వెంటనే ఫండ్స్ ఇవ్వాలని పీఆర్, అర్ అండ్ బీ మంత్రులను ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ప్రచారానికి వెళితే పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తున్నదని వాపోతున్నారు.  

ఎమ్మెల్యేలు కోరినా.. 

ఈ ఏడాది జులైలో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. అన్ని జిల్లాల్లో చెరువులు, రిజర్వాయర్లు పొంగడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. భూపాలపల్లి జిల్లాలోని బ్రిడ్జి భారీగా డ్యామేజ్ అయింది. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సెషన్ జీరో అవర్ లో 60 మందికి పైగా ఎమ్మెల్యేలు వర్షాలు, వరదలకు వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేయడానికి ఫండ్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ మంత్రులు మాత్రం ఎమ్మెల్యేలు ప్రస్తావించిన విషయాలను నోట్ చేసుకున్నమంటూ నిర్లక్ష్యపు సమాధానంతో సరిపెట్టారు. దీనిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

518 రోడ్లకు భారీ నష్టం  

వర్షాలు, వరదలకు పంచాయతీ రాజ్ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. మొత్తం 518 రోడ్లు దెబ్బతిన్నాయని, వీటి మరమ్మతులకు రూ. 700 కోట్లు ఖర్చు అవుతుందని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు.  తాత్కాలిక రిపేర్లకు మరో  రూ.140 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఆర్ అండ్ బీ రోడ్లు, బ్రిడ్జిలు భారీగా దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. వరదలతో రాష్ర్ట వ్యాప్తంగా రూ.2 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.19 జిల్లాల్లో 149 రోడ్లపై వరద ప్రవహించడంతో డ్యామేజ్ ఎక్కువగా జరిగిందని, పలు చోట్ల రోడ్లు భారీ కోతకు గురయ్యాయని చెప్తున్నారు. వీటి పర్మినెంట్ మరమ్మతులకు రూ.800 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మరో 770 కిలోటర్ల రోడ్లపై బీటీ, 319 రోడ్లపై కాంక్రీట్ డ్యామేజ్ అయ్యాయి. వీటి తాత్కాలిక మరమ్మతులకు రూ. 500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఈ రోడ్ల రిపేర్లకు నిధులను ఇవ్వాలని ఎమ్మె్ల్యేలు కోరినా, అధికారులు విన్నవించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఫండ్స్ ఇవ్వడం లేదు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలోనని ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు.  

హడావుడిగా కొత్త రోడ్లు శాంక్షన్   

అధికార పార్టీ అభ్యర్థుల ప్రకటన తరువాత ఎమ్మెల్యేలు చేసిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ కొత్త బీటీ రోడ్లను ప్రభుత్వం శాంక్షన్ చేసింది. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కొత్త రోడ్ల పనులను హడావుడిగా మంజూరు చేశారు. అయితే ఈ పనులకు బిల్లులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో వస్తాయని అధికారులు చెబుతున్నారు.