
- పది లక్షల సాయం ప్రకటించిన ఐడ్రీమ్ చైర్మన్ వాసుదేవ రెడ్డి
- మరింత చేయూత కోసం ఫండ్ రైజింగ్ ఏర్పాటు
కరోనా బారినపడి చనిపోయిన iDream Media జర్నలిస్ట్ TNR కుటుంబానికి అండగా మేమున్నామంటూ iDream చైర్మన్ వాసుదేవ రెడ్డి ముందుకొచ్చారు. TNR కుటుంబాన్ని కలిసి ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. అనంతరం కుటుంబానికి ఆర్థికంగా మద్దతు తెలుపుతూ రూ. 10 లక్షలు TNR భార్య జ్యోతికి అందజేశారు. అంతేకాకుండా.. పిల్లల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. TNR ఫ్యామిలీకి మరింతగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో.. ఆయన భార్య అనుమతితో ఇండియాతో పాటు అమెరికాలో కూడా ఫండ్ రైజింగ్ చేస్తున్నట్లు వాసుదేవరెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలియజేస్తూ.. వాసుదేవరెడ్డి తన ఫేస్‌బుక్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు.
‘ఇటీవలే అందరినీ విషాదంలో ముంచుతూ అనంత లోకాలకు వెళ్ళిపోయిన ఐడ్రీమ్ మీడియా ప్రముఖ జర్నలిస్ట్ TNR మన మనసుల్లో ఎంతగా పెనవేసుకుపోయారో మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న నివాళి సాక్షిగా చూస్తున్నాం.
ఇవాళ ఉదయం TNR కుటుంబాన్ని కలవడం జరిగింది. కుటుంబ అవసరాల కోసం ఇప్పటి వరకు పది లక్షలు ఇవ్వటం జరిగింది. కేవలం ఆర్ధిక మద్దతే కాకుండా TNR పిల్లల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలు తీసుకుంటున్నాను.
ప్రస్తుతం వారి పిల్లలతో పాటు కొందరు ఇతర కుటుంబ సభ్యులు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారింపబడి చికిత్స తీసుకుంటున్నారు. అదృష్టవశాత్తు ఎవరికీ సీరియస్ గా లేదు, వేగంగా కోలుకుంటున్నారు. అపోలో హాస్పిటల్స్ నుంచి ప్రముఖ వైద్యులు ఒకరు TNR కుటుంబానికి కావలసిన వైద్య సహాయం అందిస్తున్నారు.
ఇక TNR కుటుంబం కోసం సేకరిస్తున్న విరాళాలకు సంబంధించి, ఒక చిన్న వివరణ:
TNR హఠాన్మరణంతో దిగ్భ్రాంతికి గురైన సన్నిహితులు, స్నేహితులు కొందరు ముందుకు వచ్చి పిల్లల భవిష్యత్తు కోసం ఫండ్ సమీకరించాలని నిర్ణయించుకుని ఆ మేరకు పిలుపు ఇవ్వటం జరిగింది. శాయశక్తులా అన్ని రకాల ప్రయత్నాలు చేసినా TNRని కాపాడుకోలేకపోయామనే మానసిక క్షోభ వాళ్ళను వెంటాడుతూనే ఉంది. ఆ కారణంగానే TNR పిల్లలకు ఎలాంటి లోటు రాకూడదనే ఉద్దేశ్యం తో ఈ కార్యాక్రమం చేపట్టారు. అది కూడా TNR కుటుంబంతో పూర్తిగా చర్చించిన మీదటే ఆ వివరాలను బయటికి వెల్లడి చెయ్యడం జరిగింది.
ఇండియాలో సేకరింపబడుతున్న విరాళాలు అన్ని కూడా నేరుగా TNR భార్య జ్యోతి గారి అకౌంట్ కే జమ అవుతున్నాయి. అమెరికాలో ఉండే స్వాతి కారంచేటి ద్వారానే నాకు TNR పరిచయం. స్వాతి కారంచేటి ద్వారా అమెరికాలో GoFundMe ద్వారా ఇప్పటి వరకు దాదాపు పదిలక్షలు సేకరించడం జరిగింది. మరో మూడు నాలుగు రోజుల తరువాత జమైన మొత్తం జ్యోతిగారి అకౌంట్ కు పంపిస్తారు. నాకు తెలిసి TNR కోసం ఫండ్ కలెక్షన్ జరుగుతుంది ఈ రెండు కార్యక్రమాల ద్వారానే.
TNR కేవలం iDream సంస్థకు ఉద్యోగి మాత్రమే కాదు. వ్యక్తిగతంగా నాకు సన్నిహితుడు, స్నేహితుడు. సంస్థ ఎదుగుదలకు ఎన్నో సూచనలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉండటం నా బాధ్యత. వాళ్ళ పిల్లల భవిష్యత్తు, జ్యోతి గారికి కావాల్సిన నైతిక, ఆర్థిక మద్దతు అందజేసే విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదు. వ్యక్తిగా TNR మనమధ్య లేకపోయినా ఆయన విడిచి వెళ్లిన జ్ఞాపకాలు, చేసిన కళాసేవ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి’ అని iDream Media Chairman వాసుదేవరెడ్డి అన్నారు.
ఇప్పటికే TNR మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి ఆర్థికంగా పలువురు నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా లక్ష రూపాయలు ప్రకటించారు. డైరక్టర్ మారుతీ, నటుడు సంపూర్ణేష్ బాబు రూ. 50 వేలు ప్రకటించారు.