మైక్రో ఇరిగేషన్​కు ఫండ్స్ ఇస్తలేరు 

మైక్రో ఇరిగేషన్​కు ఫండ్స్ ఇస్తలేరు 
  • మూడేండ్లుగా బిందు, తుంపర సేద్యానికి నిలిచిన రాయితీ
  • పాలీహౌజ్‌‌ల  పాత బకాయిలూ ఇవ్వలే
  • రూ. 325 కోట్ల వరకు పెండింగ్​
  • రాష్ట్ర వాటా ఇవ్వక వెనక్కి పోతున్న కేంద్ర నిధులు

హైదరాబాద్, వెలుగు: మైక్రో ఇరిగేషన్‌‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మూడేండ్లుగా బిందు, తుంపర సేద్యానికి సబ్సిడీని  పూర్తిగా నిలిపివేసింది. మైక్రో ఇరిగేషన్‌‌ కోసం కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటా చెల్లించకపోవడంతో డ్రిప్‌‌, స్ప్రింక్లర్లతో కల్టివేషన్‌‌ ఆగిపోయింది. దీంతో భూగర్భ జలాలు, నీటి వసతి తక్కువగా ఉండే ప్రాంతాల్లోని రైతులు ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం మైక్రో ఇరిగేషన్‌‌ కోసం గత 2019–20లో రూ.294.39 కోట్లు 2020–21లో రూ.88 కోట్లు, 2021–22 బడ్జెట్‌‌లో రూ.75 కోట్లు కేటాయించింది. కానీ రాష్ట్ర సర్కారు స్పందించకపోవడంతో నిధులు వెనక్కి పోతున్నాయి. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం వాటా  రూ.142 కోట్లు ఇవ్వాల్సి ఉండగా బడ్జెట్‌‌లో రూ.299 కోట్లు కేటాయించింది. కానీ పైసా విడుదల చేయలేదు. హార్టికల్చర్ ప్రమోషన్, పాలిహౌస్​లకు ఒక్క పైసా ఇవ్వలేదు. దీంతో మైక్రో ఇరిగేషన్‌‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గతంలో మంజూరైన వాటికి సంబంధించి కూడా దాదాపు రూ.325 కోట్ల వరకు పెండింగ్‌‌లో ఉన్నాయి. ఈ ఏడాదైనా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందా అంటే ఇప్పటివరకు చడీ చప్పుడు లేదు. మైక్రో ఇరిగేషన్‌‌పై ఉద్యానశాఖ ఏటా ప్రణాళికలు రూపొందిస్తున్నా రాష్ట్రం వాటా నిధులు విడుదల కాక ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.
సబ్సిడీ కోల్పోతున్న రైతులు
మైక్రో ఇరిగేషన్‌‌కు వ్యయం తక్కువే అయినా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.  భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కోసం లక్షల కోట్లు కేటాయిస్తూ.. మరోవైపు వంద నుంచి రెండు వందల కోట్ల వ్యయం అయ్యే మైక్రో ఇరిగేషన్‌‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రైతులు బిందు సేద్యం కోసం దరఖాస్తు చేసుకుంటే 100 శాతం సబ్సిడీ, బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీ ఇస్తారు. స్ప్రింకర్లపై 75శాతం సబ్సిడీ ఉంటుంది. పక్క రాష్ట్రం ఏపీలో ఏటా రూ.500 కోట్లకు పైగా మైక్రో ఇరిగేషన్ కు కేటాయిస్తుండగా, ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే  కేంద్రం నిధులు ఇచ్చినా రైతులు రాయితీని  కోల్పోతున్నారు. 
భూగర్భ జలాలతో 37.12 లక్షల ఎకరాల్లో సాగు
రాష్ట్రంలో 37.12 లక్షల ఎకరాల్లో భూగర్భ జలాలతో పంటలు సాగు చేస్తున్నారు. భూగర్భ జలాలు, నీటి సౌకర్యం తక్కువగా ఉండే ప్రాంతాల్లో రైతులు బిందుసేద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసుకుని అధిక దిగుబడులు పొందేందుకు బిందు సేద్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గతంలో అమలు చేసిన మెక్రో ఇరిగేషన్‌‌ ద్వారా హైదరాబాద్‌‌ శివారు జిల్లాల్లోనే వేల ఎకరాల్లో బిందు, తుంపర్ల సేద్యం విస్తరించింది. ఈ పద్ధతి ద్వారా పండ్ల తోటలు, వాణిజ్య పంటలైన చెరుకు, పత్తి, మిరప, పొగాకు, మల్బరీ, కూరగాయలు, పూలతోటలసాగు పెరిగింది. గత మూడేళ్లుగా ప్రోత్సాహం లేక సాగు గణనీయంగా పడిపోతోంది.
2014-15     76,000
2015-16     99,643
2016-17     1,54,956
2017-18     2,23,565
2018-19                                                    -
2019-20                                                    -
2020-21                                                    -
మొత్తం      5,54,164