సర్వం హుజూరాబాద్​కే

సర్వం హుజూరాబాద్​కే

నిధులు..  స్కీములు.. నామినేటెడ్  పోస్టులు అన్నీ అటే
అడిగినోళ్లకు అడిగినంత సమర్పణ
కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, రెండో విడత గొర్రెలు కూడా..
పెండింగ్ స్కీములన్నీ ఇప్పుడు రన్నింగ్​లోకి
రూ. 3 వేల కోట్లు మళ్లించేందుకు ఏర్పాట్లు
కోకాపేట భూములమ్మగా వచ్చిన డబ్బులన్నీ అక్కడికే 

నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం హుజూరాబాద్ జపం చేస్తోంది. ఉప ఎన్నికలో లబ్ధి పొందేందుకు అధికార పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఒక్క సెంటర్​కే భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను మళ్లిస్తోంది. ఓట్లను టార్గెట్​గా చేసుకొని అక్కడే కొత్త కొత్త స్కీములు అనౌన్స్ చేస్తోంది. అడిగినోళ్లకు అడిగినన్ని నిధులు ఇస్తోంది. కులాలు, మతాల వారీగా ఇంటింటికీ లాభం చేకూర్చే నజరానాలతో ఓటర్లను మురిపిస్తోంది. సీఎం కేసీఆర్ డైరెక్షన్​లో మినిస్టర్లు, ఆఫీసర్లు హుజూరాబాద్​లోనే  మకాం వేశారు.
హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి ఈటల రాజేందర్​ రాజీనామా చేయటంతో హుజూరాబాద్​లో త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఇక్కడ ఎట్లయినా గెలిచి తీరాలని సీఎం కేసీఆర్ నెల రోజుల ముందునుంచే ఫోకస్ చేశారు. అదే టార్గెట్​తో ఈ నెలలోనే ప్రగతిభవన్​లో హుజూరాబాద్ ప్రధాన ఎజెండాతో ఐదు సార్లు రివ్యూలు చేశారు. అక్కడి ప్రజాప్రతినిధులను, పార్టీ లీడర్లను స్వయంగా ప్రగతిభవన్​కు  పిలిపించుకొని ప్రత్యేక మీటింగ్ నిర్వహించారు. ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు ఇచ్చే దళిత బంధు స్కీమ్​ను హుజూరాబాద్​ నుంచే స్టార్ట్​ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. పథకం కింద ఈ ఒక్క నియోజకవర్గానికే రూ. 2 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. నియోజకవర్గంలో దాదాపు 20 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు సాయాన్ని అందించాలనే టార్గెట్​ పెట్టుకున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో మౌలిక వసతులకు రూ. 30 కోట్లు విడుదల చేశారు. సొంత పార్టీ లీడర్లకు మేలు చేసేందుకు అడ్డదారుల్లో బిల్లులను పెంచేందుకు ప్రభుత్వం వెనుకాడటం లేదు. 

చెక్ డ్యాంల రివైజ్డ్ ఎస్టిమేట్లకు ఆస్కారం లేకున్నా వీణవంక మండలంలోని కాల్వల వాగుపై చెక్ డ్యాం అంచనాలను ఏకంగా రూ. 48 లక్షలు పెంచేసింది. నియోజకవర్గంలోని మిగతా 18 చెక్ డ్యామ్​ల  ఎస్టిమేట్లు పెంచేందుకు ఫైళ్లు కదుపుతోంది. దళిత బంధుతో పాటు వివిధ పనులు, బిల్లుల పేరుతో ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే దాదాపు రూ. 3,000 కోట్లు హుజూరాబాద్​ నియోజకవర్గానికి మళ్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. ఇటీవల కోకాపేటలో భూముల అమ్మకం ద్వారా వచ్చిన నిధులన్నీ హుజూరాబాద్​కే  రిజర్వ్ చేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
పెండింగ్ స్కీములన్నీ రన్నింగ్​లోకి..
హుజూరాబాద్ బై ఎలక్షన్ పుణ్యమా అని పెండింగ్  స్కీములు, పెండింగ్​ హామీలన్నీ అధికార పార్టీకి ఇప్పుడు యాదికొస్తున్నాయి. కొత్త పింఛన్ల జాబితాలు రెడీ చేస్తున్నారు. గురువారం హుజూరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న  కలెక్టర్.. 57 ఏండ్లు దాటినోళ్లందరి లిస్టు రెడీ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.  మరోవైపు మంత్రులు కల్యాణ లక్ష్మి పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 11 వేలకు పైగా కొత్త పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. కొత్త రేషన్​ కార్డులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.  
ఎల్లుండి నుంచి గొర్రెల పంపిణీ
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక టైంలో నల్గొండలో ఆగిన రెండో విడత గొర్రెల పంపిణీని మళ్లీ హుజూరాబాద్ నుంచి మొదలు పెడుతున్నారు. ఈ నెల 28న మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్ జమ్మికుంటలో దీన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేస్తున్నారు.  నియోజకవర్గంలో గతంలోనే గొర్రెల స్కీమ్​లో భాగంగా లబ్ధిదారుల వాటా కింద  2,874 మంది డీడీలు చెల్లించారు. అయితే  ఇంకా 1,500 మంది డీడీలు చెల్లించాల్సి ఉంది.  వీరందరూ వాటాను చెల్లించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.  దాదాపు 4,500 గొర్రెల యూనిట్లను వెంటనే పంపిణీ చేయాలని ప్రభుత్వం టార్గెట్ ఇచ్చింది.
కులాలకు భవనాలు.. ప్రత్యేక హామీలు
ఓట్లకు ఎర వేసే ప్లాన్​లో  భాగంగా కులాలవారీగా అడిగినంత సమర్పించుకోవాలని ప్రభుత్వం డిసైడయింది. గీత కార్మికులకు గిరక తాటి మొక్కల పంపిణీతో పాటు మోపెడ్లను అందిస్తామని టీఆర్ఎస్  లీడర్లు హామీలు గుప్పించారు. టీఆర్ఎస్ పార్టీ  వర్ధన్న పేట మండల ఇన్​చార్జ్​  ఆరూరి రమేశ్  మండలంలోని గౌడ సంఘాల నాయకులతో మీటింగ్ పెట్టారు. శాంపుల్ గా కొన్ని గ్రామాలకు మొక్కలను తెప్పించి నాటించారు. కల్లు గీత కార్మిక సంఘాలకు గిరకతాటి మొక్కలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల హుజూరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అక్కడి గీత కార్మికుల కమ్యూనిటీ భవనానికి ఎకరం స్థలం కేటాయించారు. భవన నిర్మాణం కోసం రూ. కోటి రుణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హుజూరాబాద్, జమ్మికుంట టౌన్లలో ఎక్కువ ఓట్లున్న ఆర్య వైశ్య కమ్యూనిటీకి మంత్రి హరీశ్​రావు హామీలు ఇచ్చారు. వీరికి కమ్యూనిటీ బిల్డింగుల  కోసం స్థలాలతో పాటు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. జమ్మికుంట వాళ్లకు సైదాబాద్ గ్రామ శివారులోని 234 సర్వే నంబర్ లో ఒక ఎకరం ప్రభుత్వ భూమిని కేటాయించారు. హుజూరాబాద్  వాళ్లకు ఎస్సారెస్పీ క్యాంపు  జాగలో ఎకరం స్థలం అప్పగించారు.
నామినేటెడ్​ పోస్టులతో ఎర 
హుజూరాబాద్​లో ఎస్సీలవి Aసుమారు 48 వేల ఓట్లు ఉన్నాయి. అందుకే ఇక్కడే దళిత బంధు ఫథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు  500 దళిత కుటుంబాలతో త్వరలోనే సీఎం వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఇవన్నీ జరుగుతుండగానే..  హుజూరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నేత బండ శ్రీనివాస్ కు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేటెడ్​ పదవి అప్పగించారు. పార్టీలోని లీడర్లు నామినేటెడ్ పోస్టుల కోసం రెండేండ్లుగా ఎదురుచూస్తుంటే.. ఎలక్షన్ టార్గెట్​గా ఈ నియామకం జరగటం కొసమెరుపు.