పదవీ కాలం 24 రోజులే.. పంచాయతీ బిల్లులు రాలే

పదవీ కాలం 24 రోజులే..  పంచాయతీ బిల్లులు రాలే
  •     పేరుకు పోయిన లక్షల రూపాయల బకాయిలు
  •     పట్టించుకోని గత బీఆర్ఎస్ ​సర్కార్
  •     ఈ ప్రభుత్వమైనా విడుదల చేయాలని కోరుతున్న సర్పంచ్​లు

కరీంనగర్, వెలుగు : ఐదేళ్ల క్రితం గెలిచిన సర్పంచ్​ల పదవీకాలం మరో 24 రోజుల్లో ముగియబోతున్నది. వారి పదవీకాలం దగ్గర పడుతున్నా చేసిన పనులకు మాత్రం బిల్లులు విడుదల కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్, సిబ్బంది జీతాలకే సరిపోతుండడంతో, ఏదైనా పనులు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే అవసరమవుతున్నాయి. గత సర్కారు హయాం నుంచే ఏడాదిగా ఒక్కో గ్రామంలో లక్షలాది రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. గ్రామానికి ఏదైనా చేయాలనే ఆలోచనతో అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే.. బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్​లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సర్పంచ్ కు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలకుపైగా బిల్లులు రావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా రూ.300 కోట్లకుపైగా పెండింగ్ బిల్లులు ఉన్నట్లు అంచనా. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటం, బిల్లులు సకాలంలో రాకపోవడంతో సర్పంచ్ లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత ప్రభుత్వం సర్పంచ్ ల బాధలు పట్టించుకోలేదని, ఈ ప్రభుత్వమైనా నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. 

వెంటపడి పనులు చేయించి..

గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ నిధులతో గ్రామ పంచాయతీల్లో రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులను అధికారులు సర్పంచ్ ల వెంటపడి నిర్మించారు. ఒక్కో రైతు వేదికను రూ.22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించగా.. ఇందులో రూ.12 లక్షలు ఉపాధి హామీ నిధుల నుంచి ఖర్చు చేయగా, మిగతా రూ.10 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. చాలా పంచాయతీల్లో ఈజీఎస్ నిధులు వచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పూర్తిగా విడుదల కాలేదు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు తదితర అభివృద్ధి పనుల కోసం అప్పులు తెచ్చి పెట్టినప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. ప్రతి నెలా పంచాయతీల్లో కార్మికుల జీతాలు, ట్రాక్టర్ ఈఎంఐ, డీజిల్ ఖర్చులు, కరెంట్ బిల్లులకు కేంద్రం నెలనెలా వేసే నిధులు ఖర్చు చేస్తుండగా, అవే నిధులకు సమానంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు ఆలస్యం అవుతుండటంతో ఇబ్బందులు తప్పడం లేదని సర్పంచ్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రూ.20 లక్షల బిల్లులు రావాలి

ఇల్లందకుంట మండల కేంద్రంలో కొత్తగా కట్టిన గ్రామ పంచాయతీ బిల్డింగ్ కు పెట్టిన డబ్బులు, గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి ఖర్చు చేసిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. పనులు పూర్తయిన వెంటనే డబ్బులిస్తామని చెప్పి.. చెల్లించలేదు. నాకు రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉంది. అప్పులు ఇచ్చినవాళ్ల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ ప్రభుత్వమైనా నిధులు విడుదల చేసి ఆదుకోవాలి. 
-
 కంకణాల శ్రీలత, సర్పంచ్, ఇల్లందకుంట, 

రూ.60 లక్షల బిల్లులు రాలే.. 

నేను చేసిన పనులకు సంబంధించి రూ.1.20 కోట్లు రావాల్సి ఉండగా.. గత ప్రభుత్వం హయాంలో అనేకసార్లు అడిగితే సగం వరకు క్లియర్ చేశారు. ఇంకా రూ.60 లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. సర్పంచ్​ బిల్లుల గురించి ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచ్ లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది. మా పదవీ కాలం ముగిసేవరకైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలి. 
-
రొడ్డ పృథ్వీరాజ్, సర్పంచ్, మానకొండూర్