ఎఫ్‌‌ఐఐలను మించి ఇన్వెస్ట్‌‌ చేసిన ..ఫండ్స్‌‌, రిటైల్ ఇన్వెస్టర్లు

ఎఫ్‌‌ఐఐలను మించి ఇన్వెస్ట్‌‌ చేసిన ..ఫండ్స్‌‌, రిటైల్ ఇన్వెస్టర్లు
  •     ఈ ఏడాది మొదటి 11 నెలల్లో నికరంగా రూ.3.31 లక్షల కోట్లు మార్కెట్‌‌లో పెట్టిన మ్యూచువల్ ఫండ్స్‌‌

న్యూఢిల్లీ :  ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌ఐఐ) ఒకానొక దశలో మార్కెట్ నుంచి వెళ్లిపోయినా తామున్నామంటూ  రిటైల్‌‌ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ సపోర్ట్‌‌గా నిలిచాయి.  బెంచ్ మార్క్ ఇండెక్స్‌‌లు భారీగా పడిపోకుండా చూసుకోగలిగాయి. యూఎస్‌‌ ఫెడ్ వడ్డీ రేట్ల పెంచిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు దేశ మార్కెట్‌‌లోని తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో వెనక్కి తీసేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. ఈ ఏడాది ఫిబ్రవరి – జులై మధ్య ఫెడ్ వడ్డీ రేట్లను 4.50–4.75 శాతం నుంచి 5.25 – 5.50 శాతానికి పెంచింది. ఆ తర్వాత రేట్ల పెంపునకు బ్రేక్‌‌లేసింది.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.1.64 లక్షల కోట్లను ఇండియన్ మార్కెట్‌‌లో పెట్టారు. కిందటేడాది ఇదే టైమ్‌‌లో రూ. 65,906 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు  మ్యూచువల్ ఫండ్స్‌‌ ఈ ఏడాది నవంబర్ నాటికి నికరంగా రూ.3.13 లక్షల కోట్లను  మార్కెట్‌‌లో ఇన్వెస్ట్ చేశాయి. కిందటేడాది ఇదే టైమ్‌‌లో రూ.80,998 కోట్లు  మాత్రమే పెట్టాయి. మ్యూచువల్ ఫండ్స్ గత 11 నెలల్లో మార్కెట్‌‌లో పెట్టిన  నికర పెట్టుబడుల్లో  రూ.1.45 లక్షల కోట్లు డైరెక్ట్‌‌గా ఈక్విటీ ఫండ్స్‌‌ నుంచి రాగా, మరో రూ.1.66 లక్షల కోట్లు నెల వారి సిప్‌‌ (సిస్టమాటిక్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్ ప్లాన్‌‌) రూట్‌‌లో వచ్చాయి.

గత పదకొండు నెలల్లో ఒక్క నెల కూడా మ్యూచువల్ ఫండ్స్‌‌ నికర అమ్మకందారులుగా మారలేదు. సిప్‌‌ పెట్టుబడులైతే ఈ ఏడాది నవంబర్‌‌‌‌లో రికార్డ్ లెవెల్‌‌ రూ.17 వేల కోట్ల మార్క్‌‌ను టచ్‌‌ చేశాయి.  యూఎస్‌‌లో వడ్డీ రేట్లు పెరగడంతో ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో విదేశీ ఇన్వెస్టర్లు నికరంగా రూ.34,146 కోట్లను మార్కెట్‌‌ నుంచి బయటకు తీసేశారు. ఆ తర్వాత నుంచి ఆగస్టు వరకు నికర కొనుగోలుదారులుగా మారారు.

సెప్టెంబర్‌‌, అక్టోబర్‌‌‌‌లో మాత్రం  మరో రూ.39,316 కోట్ల విలువైన షేర్లను అమ్మారు.  ఆ తర్వాత  నికరంగా రూ.66,314 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. స్మాల్‌‌క్యాప్‌‌  మ్యూచువల్ ఫండ్స్‌‌లోకి గత 11 నెలల్లో నికరంగా రూ.37,178 కోట్లు వచ్చాయి. కిందటేడాది ఇదే టైమ్‌‌లో సుమారు రూ.17,551 కోట్లు మాత్రమే వచ్చాయి.