నిధులు రిలీజ్ చేసి.. పంచాయతీలను ఆదుకోవాలి : రేవంత్ రెడ్డి

నిధులు రిలీజ్ చేసి.. పంచాయతీలను ఆదుకోవాలి : రేవంత్ రెడ్డి
  • సీఎం కేసీఆర్​కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
  • సర్పంచుల హక్కులు కాలరాస్తున్నారని విమర్శ
  • స్పందించకపోతే జనవరి 2న ధర్నా చేస్తామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన నిధులతో పాటు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్​ నుంచి రావాల్సిన ఫండ్స్​ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రిలీజ్ చేసి పంచాయతీలను ఆదుకోవాలని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దొంగచాటుగా దారి మళ్లించిందని ఆరోపించారు. గురువారం ఈ అంశంపై సీఎం కేసీఆర్​కు రేవంత్ బహిరంగ లేఖ రాశారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల విషయంలో రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని లేఖలో పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదలైన రూ.35వేల కోట్లను తెలంగాణ సర్కారు దొంగచాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, జీతభత్యాలు, అత్యవసరాల కోసం విడుదల చేయాల్సిన రూ.250 కోట్లను ఐదు నెలలుగా ఇవ్వడం లేదని తెలిపారు. ఫలితంగా జీపీల పరిస్థితి అధ్వానంగా మారిందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,751 జీపీల్లోని సర్పంచుల హక్కులను ప్రభుత్వం కాలరాస్తున్నదని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు సర్పంచులు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని, అయినా బిల్స్ రాకపోవడంతో వడ్డీల భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు విడుదల చేయకపోగా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు కూడా దారి మళ్లించడంతో సర్పంచులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై వెంటనే స్పందించాలని కేసీఆర్​ను కోరారు. లేకపోతే రాజీవ్​ పంచాయతీ సంఘటన్​ ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు.

తెలంగాణం మాయమైంది

ఐపీఎస్​ల పోస్టింగ్స్​లో తెలంగాణ అధికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గురువారం ఆయన ఈ విషయంపై ట్విట్టర్​లో స్పందించారు. ‘‘కల్వకుంట్ల రాజ్యంలో నిన్న పార్టీలో, నేడు పరిపాలనలో మాయమైపోయిన తెలంగాణం” అని ట్వీట్ చేశారు.