
‘నాంది’ లాంటి సూపర్ హిట్ తర్వాత అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం ‘ఉగ్రం’. మిర్నా మీనన్ హీరోయిన్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. మే 5న సినిమా రిలీజ్ కానుంది. శుక్రవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఖమ్మంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ ‘నరేష్ గారు కామెడీ నుంచి సీరియస్ పాత్రల వైపు మళ్ళారు. విజయాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. అందులో ‘ఉగ్రం’ పతాక స్థాయిలో ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. నిజంగానే నరేష్ ఉగ్ర రూపం దాల్చారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. నరేష్ మాట్లాడుతూ ‘ఇది నా షష్టిపూర్తి (60వ) చిత్రం. కామెడీ ఇమేజ్ ఉన్న నాకు.. ఇలాంటి కథలతో మరింత గుర్తింపు వస్తోంది. ‘నాంది’లో అండర్ ట్రయిల్ ఖైదీలు గురించి చెప్పాం. ‘ఉగ్రం’లో మిస్సింగ్ కేసులు గురించి చూపించబోతున్నాం. చాలా రీసెర్చ్ చేసిన కథ ఇది. ‘నాంది’ కంటే పదిరెట్లు ఇంటెన్స్ ఉంటుంది’ అన్నాడు. ‘చాలా ఎమోషన్ ఉన్న కథ. ఉగ్ర రూపంలో ఉంటుంది. నరేష్ యాక్షన్ దద్దరిల్లుతుంది’ అన్నాడు విజయ్ కనకమేడల. నిర్మాత హరీష్ పెద్ది, డైలాగ్ రైటర్ అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు.