జీ20 సమిట్.. నాకు స్పెషల్: రిషి సునాక్

జీ20 సమిట్..  నాకు స్పెషల్: రిషి సునాక్

న్యూఢిల్లీ:     ఢిల్లీలో జరిగే జీ20 సమిట్ తనకు ప్రత్యేకమైనదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. తాను ఇండియా అల్లుడినని అనడంపై స్పందించారు. ‘‘ఇది కచ్చితంగా ప్రత్యేకమే. నేను ఇండియాకు అల్లుడినని అంటున్నట్లు నాకు తెలిసింది. నాపై ఆప్యాయతతోనే నన్ను అలా పిలుస్తున్నారని అనుకుంటున్నా” అని అన్నారు. 

బ్రిటన్‌‌‌‌ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ రికార్డు సృష్టించారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తిని ఆయన పెళ్లి చేసుకున్నారు. అలా ఆయన ‘ఇండియాకు అల్లుడు’ అయ్యారు. శుక్రవారం ఢిల్లీకి బయల్దేరిన తర్వాత విమానంలోనే మీడియాతో రిషి మాట్లాడారు. ఇండియాకు వెళ్లడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, భారతదేశం తన మనసుకు చాలా దగ్గరైన దేశమని చెప్పారు. 

‘‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం, అంతర్జాతీయ సంబంధాలను నిర్మించడం, అత్యంత బలహీనులకు మద్దతు ఇవ్వడం తదితర అంశాలతో.. జీ20 సమిట్‌‌‌‌కు క్లియర్ ఫోకస్‌‌‌‌తో వెళ్తున్నా” అని అంతకుముందు రిషి ట్వీట్ చేశారు. తన సతీమణితో కలిసి ఢిల్లీ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టుకు చేరుకున్న రిషి సునాక్‌‌‌‌కు.. కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే స్వాగతం పలికారు. కాగా, గత మే నెలలో జపాన్‌‌‌‌లోని హిరోషిమాలో జరిగిన జీ7 సమిట్‌‌‌‌లో ప్రధాని మోదీ, రిషి సునాక్ చివరి సారిగా కలుసుకున్నారు. 

పుతిన్‌‌‌‌పై మండిపాటు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై రిషి సునాక్ స్పందిస్తూ.. ‘‘జీ20లో తన ముఖం చూపించడంలో మరోసారి వ్లాదిమిర్ పుతిన్ విఫలమయ్యారు. తన సొంత దౌత్య ప్రవాసానికి ఆయనే రూపశిల్పి. తన అధ్యక్ష భవనంలో తనను తాను ఐసోలేట్ చేసుకున్నారు. విమర్శలను, వాస్తవికతను అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో పుతిన్ పతనానికి కలిసి పని చేస్తామని మిగతా జీ20 దేశాలు చెబుతున్నాయి” అని చెప్పారు.