
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. గురువారం మర్పల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు.
ప్రతి ఒక్కరు ఆరో తేదీ లోపల దరఖాస్తులు చేసుకోవాలన్నారు. తిరిగి నాలుగు నెలల తర్వాత దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వికారాబాద్ సెగ్మెంట్‌లో రోడ్ల నిర్మాణానికి 300 కోట్లు నిధులను కేటాయిస్తానన్నారు. అదనంగా రోడ్ల నిర్మాణలకు కేంద్ర ప్రభుత్వానికి 150 కోట్ల రూపాయల మంజూరుకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. అనంతరం స్పీకర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మహబూబాబీ, ఆర్డీవో విజయ కుమారి, మండల ప్రత్యేక అధికారి అనిత, జడ్పీటీసీ మధుకర్, ఎంపీపీ బట్టు లలిత, ఎంపీటీసీ సంగీత, పీఎసీఎస్ చైర్మన్ ప్రవీణ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.