బాల్క సుమన్‌‌ కాంట్రాక్ట్ .. ఉద్యోగాలను అమ్ముకున్నడు : గడ్డం వంశీకృష్ణ

బాల్క సుమన్‌‌ కాంట్రాక్ట్ .. ఉద్యోగాలను అమ్ముకున్నడు : గడ్డం వంశీకృష్ణ
  • ఎస్‌‌టీపీపీలో 80% ఉద్యోగాలు నాన్​లోకల్స్‌‌కు ఇచ్చి, స్థానికులకు అన్యాయం చేసిండు: గడ్డం వంశీకృష్ణ
  • కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే కార్మికులకు న్యాయం చేస్తామని హామీ

జైపూర్/కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌‌ (ఎస్‌‌టీపీపీ)లోని పరిస్థితులు కేజీఎఫ్ సినిమాను తలపించేలా ఉన్నాయని.. అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్ట్‌‌ కార్మికులు చెప్పడం చాలా బాధాకరమని చెన్నూరు కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్‌‌ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంట్రాక్ట్‌‌ వర్కర్ యూనియన్ దుస్స భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌‌లో పాల్గొని, ఎస్‌‌టీపీపీలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను ఆయన విన్నారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, తమ తాతయ్య కాకా వెంకటస్వామి కృషితో ఎస్‌‌టీపీపీ ఏర్పాటైందని గుర్తుచేశారు. 

ఇక్కడి ఎమ్మెల్యే బాల్క సుమన్ అహంకార వైఖరి వల్లే కాంట్రాక్ట్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్‌‌టీపీపీ, ఓపెన్ కాస్టుల్లో నాన్ లోకల్ వాళ్లకు 80 శాతం ఉద్యోగాలిచ్చి, ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి 5 లక్షల దాకా వసూలు చేశారని ఆరోపించారు. దీంతో స్థానికులు, భూ నిర్వాసితుల పిల్లలు నష్టపోయారన్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏటా రూ.వెయ్యి కోట్ల ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నారని వంశీకృష్ణ ఆరోపించారు. కాకా వెంకట స్వామి ఫ్యామిలీ ప్రజల సంక్షేమం కోరే కుటుంబమన్నారు. తమ తండ్రి వివేక్ వెంకటస్వామిని చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఆ తర్వాత వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్య క్రమంలో ఎస్‌‌టీపీపీ కాంట్రాక్ట్ యూనియన్ అర్గనైజింగ్ సెక్రటరీ సురేందర్, వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, రాజశేఖర్, కృష్ణ పాల్గొన్నారు.
 

బాల్క సుమన్‌‌కు ఓటేస్తే నిరుద్యోగులకు ఉరే: తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ


ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు, బాల్క సుమన్‌‌కు ఓటేస్తే.. నిరుద్యోగులకు ఉరే గతి అని నిరుద్యోగ విద్యార్థి జేఏసీ పేర్కొంది. సోమవారం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్, మందమర్రిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, వివేక్‌‌ వెంకటస్వామికి మద్దతు ప్రకటించారు. ఉరి తాళ్లు, ప్లకార్డులతో ప్రచారం నిర్వహించారు. యువతకు ఉద్యోగ డిక్లరేషన్ ఇవ్వడంతో తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని తెలంగాణ నిరుద్యోగ విద్యార్థి జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ కామ్రే పేర్కొన్నారు. వచ్చే నెల 3న బీఆర్ఎస్‌‌ను ఓడిస్తే.. అప్పుడు 39 లక్షల మంది నిరుద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పారు. నిరుద్యోగులంతా కలసి చెన్నూరులో కేసీఆర్, కేటీఆర్, బాల్క సుమన్‌‌ను బొంద పెడ్తారని చెప్పారు. యువతకు ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.