
కోల్‌బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా బెల్లంపల్లి నియోజకవర్గంలో చేపట్టిన బైక్ ర్యాలీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. శుక్రవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆధ్వర్యంలో తాండూరు మండలం కిష్టంపేట నుంచి ఐడీ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో వంశీకృష్ణ స్వయంగా బైక్నడుపుతూ యూత్‌ను ఎంకరేజ్చేశారు.
తాండూరు, అచ్చాలపూర్, కాసీపేట మండల కేంద్రం, దేవాపూర్‌లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్, కుమ్రం భీం విగ్రహాలకు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పూలమాలలు వేశారు. మహిళలు మంగళహారతులతో వారికి ఘన స్వాగతం పలికారు.
డప్పు చప్పుళ్ల మధ్య రోడ్ షోలు జరగ్గా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత, ప్రజలు, రైతులు బీఆర్ఎస్ పాలనతో పడిన ఇబ్బందులు, కష్టాలను తన ప్రసంగాల్లో చెప్పుతూ వంశీకృష్ణ ప్రజల్లో ఆలోచన కలిగించారు. తానను ఎంపీగా గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులతోపాటు, సమస్యలను తీర్చే తీరును వివరించారు.