కార్మిక పక్షపాతి కాకా వెంకటస్వామి.. నేతల ఘన నివాళి

కార్మిక పక్షపాతి కాకా వెంకటస్వామి.. నేతల  ఘన నివాళి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 94వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ట్యాంక్‌‌బండ్‌‌పై ఆయన విగ్రహానికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కాకా అభిమానులు, దళిత సంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్, ఎంపీ కె.లక్ష్మణ్, కర్నాటకలోని కోలార్ ఎంపీ మునుస్వామి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, ఆరేపల్లి మోహన్, కొండేటి శ్రీధర్‌‌‌‌, కాకా కుమారులు వివేక్ వెంకటస్వామి, వినోద్, అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్‌‌ సరోజా వివేకానంద, ఇతర కుటుంబ సభ్యులు, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్​కుమార్, శంకర్ రావు తదితరులు  కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిండు మనస్సుతో తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తి కాకా అని మంత్రి హరీశ్‌‌ రావు ట్వీట్ చేశారు. కార్మిక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల అభ్యునతికి కృషి చేసిన వెంకటస్వామి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,  తెలంగాణ ఉద్యమంలో ఎంపీలంతా పోరాడడానికి మార్గదర్శిగా ఉంటూ.. తమను ఎన్నో రకాలుగా  కాకా ప్రోత్సహించారని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. కాకా ఆశయాలను సాధించేందుకు ముందుకు వెళతామని తెలిపారు. పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాకా అని కోదండరాం అన్నారు. పేదలకు నివాస హక్కు కల్పించారని, వేల మంది ప్రస్తుతం హైదరాబాద్​లో సొంత ఇళ్లలో ఉంటున్నారంటే కాకా కృషే కారణమన్నారు. వెంకటస్వామి జయంతిని దేశమంతా నిర్వహించాలని కర్నాటక లోని కోలార్ ఎంపీ మునుస్వామి కోరారు.  కార్మికులకు పెన్షన్ స్కీమ్ తెచ్చిన మహనీయుడన్నారు. కోలార్​లో వచ్చే సారి కాకా జయంతి ఉత్సవాలు చేస్తామని తెలిపారు. కాకా జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాల  కోసం పని చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా స్టేట్ ప్రెసిడెంట్ కొప్పు భాష అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు.

కార్మిక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పోరాటం చేశారు

కార్మిక ఉద్యమాల్లో వెంకటస్వామి ప్రత్యక్షంగా పోరాటం చేశారు. ఆయన కార్మిక పక్షపాతి. హైదరాబాద్ ప్రజలతో కాకాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వేల మంది పేదల కోసం వందల బస్తీలు కట్టించారు. హైదరాబాద్‌‌లో ఎక్కడికి వెళ్లినా.. కాకా, అంజయ్య పేర్లను నిత్యం తలుచుకుంటారు. ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. కిషన్ రెడ్డి

కాకా రాష్ట్రపతి కావాల్సింది

హైదరాబాద్​లో ఇండ్లు లేని వారికి గుడిసెల వెంకట స్వామి (కాకా) ఎన్నో ఇండ్లు కట్టించారు. పేదలకు శాశ్వత ఇండ్లు కట్టించిన నేత. నేను ముషీరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నపుడు కాకాతో ప్రత్యేక అనుబంధం ఉంది. నా నియోజకవర్గంలో అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించి వేల మందికి తక్కువ ఫీజులతో విద్యను అందిస్తున్నారు. కాకాకు కాంగ్రెస్ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదు. కాకా రాష్ట్రపతి కావాల్సింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు.  ఎంపీ లక్ష్మణ్

పేదల దేవుడు కాకా

గుడిసెల వెంకటస్వామి, కాకా.. ఇలా ఏ పేరుతో పిలిచినా పలికేవారు. పేదల దేవుడు. కాకాకు వచ్చిన పేరు ఎవరికీ రాదు. పేదల కోసం ఆయన నిత్యం పోరాటం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లారు. తెలంగాణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానంతో పోరాటం చేసిన వ్యక్తి, మహనీయుడు.  బండి సంజయ్

జీవితాంతం ప్రజా సేవలో ఉన్నరు

కాంగ్రెస్​ పార్టీ నుంచి కేంద్రంలో  మాజీ మంత్రిగా పని చేసిన  గడ్డం వెంకటస్వామి (కాకా) తన జీవితాంతం ప్రజల సేవలో ఉన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేశారు.  వెంకటస్వామి  కోరుకున్న విధంగా ఆయన కుమారులు కూడా అదే వారసత్వంతో ప్రజా సేవలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కాకాకు నివాళులు అర్పించటానికి వచ్చాను. వెంకటస్వామి స్ఫూర్తితో మనమందరం ముందుకు వెళ్లాలి. ఆయన కోరుకున్న తెలంగాణ రావాలని కోరుకుంటున్న.   మాణిక్ రావ్ ఠాక్రే