హైదరాబాద్, వెలుగు: సమాజంలో అన్ని వర్గాల కోసం, సమాజ మార్పు కోసం పాటలు పాడిన గద్దర్ మరణం తీరని లోటని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటే ఉద్యమాన్ని ఉవ్వెత్తున్న లేపిందన్నారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర, భట్టి విక్రమార్క పాదయాత్రలోనూ గద్దర్ పాల్గొన్నారని చెప్పారు. మంగళవారం గాంధీభవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, రేవంత్ సభల్లోనూ గద్దర్ పాల్గొని సంఘీభావం తెలిపారన్నారు. సమాజం కోసం పనిచేసి కార్ల్ మార్క్స్ ఎలాగైతే మార్గదర్శకుడయ్యారో గద్దర్ కూడా అలాగే చేశారన్నారు. గద్దర్ చనిపోయిన రోజు నుంచి అంత్యక్రియలయ్యేదాకా అన్ని ఏర్పాట్లు రేవంత్, భట్టి విక్రమార్క తదితరులు పర్యవేక్షించారని తెలిపారు.

