Gaddar : గద్దర్.. ఆ రోజుల్లోనే ఇంజినీరింగ్ చదివి.. బ్యాంక్ ఉద్యోగం

Gaddar : గద్దర్.. ఆ రోజుల్లోనే ఇంజినీరింగ్ చదివి.. బ్యాంక్ ఉద్యోగం

ప్రజాయుద్ధనౌక, ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్.. సామాన్యుల్లో పెట్టింది పేరు. అప్పటికప్పుడు అశువులు రూపొందించి కవితలు చెప్పగల సామర్థ్యం ఆయన సొంతం. ప్రజా పోరాటాలకు అండగా నిలుస్తున్న గద్దర్.. తెలంగాణలో తన కార్యక్రమాలతో వార్తల్లో నిలుస్తున్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తన వంతుగా పాటలు పాడుతూ కీలక పాత్ర పోషించారు. పలు సినిమాల్లో కూడా ఆయన నటించారు.ప్రస్తుతం ఆయన తెలంగాణలో రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ జేఏసీతో కలిసి ఆయన పనిచేస్తున్నారు.

ALSO READ: Gaddar : అసలు పేరు విఠల్ రావు.. గద్దర్ గా ఎలా మారిందంటే.?

గద్దర్ మెదక్ జిల్లా లోని తూప్రాన్ గ్రామంలో లచ్చమ్మ, శేషయ్యలకు 1949లో దళిత కుటుంబంలో జన్మించాడు. విద్యాభ్యాసం నిజామాబాదు జిల్లా, మహబూబ్ నగర్‌లో, ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్‌లో జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావ వ్యాప్తికోసం ఆయన ఊరురా తిరిగి ప్రచారం చేసారు. దీనికొరకు ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనను ఏర్పాటు చేసారు.  1971 లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట "ఆపర రిక్షా" రాశాడు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది.

బ్యాంకు ఉద్యోగం.. ఆ వెంటనే పెళ్లి..

1975లో గద్దర్ కు కెనరా బ్యాంకులో క్లర్క్ గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకున్నారు. ఆయనకు భార్య పేరు విమల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు సూర్యూడు, చంద్రుడు, వెన్నెల. చంద్రుడు 2003లో అనారోగ్యంతో మరణించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వచ్చిన మాభూమి సినిమాలో గద్దర్ సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో నటించారు.

సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలపై తన మదిలోనే నిత్యం సంఘర్షణ జరిపేవారు గద్దర్. 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి 1985లో కారంచేడులో దళితులపై జరిగిన హత్యాకాండకు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. జన నాట్య మండలిలో క్రియాశీల సభ్యునిగా చేరారు. 1972లో ఏర్పాటైన జననాట్య మండలి అనే సంస్థ గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాలను, ఆకృత్యాలను ఎదురించి... ప్రజలను... ప్రత్యేకించి దళితులను మేల్కొలిపేందుకు వారిని చైతన్య పరచేందుకు ఏర్పడింది. 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిన గద్దర్ అనేక వేదికలపై ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి వేదికలు పంచుకున్నారు. గద్దర్ ను కేసీఆర్ ప్రజా యుద్ధనౌక గా కీర్తించేవారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో గద్దర్, కేసీఆర్ దూరం దూరంగానే ఉంటున్నారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో ఆయన సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు.