వడ్లు కొంటలేరని కలెక్టరేట్ ముట్టడి

వడ్లు కొంటలేరని కలెక్టరేట్ ముట్టడి
  • 8 కిలోల తరుగు తీస్తున్నారని ఆగ్రహం
  • గద్వాలలో రైతుల నిరసన 
  • అడిషనల్​ కలెక్టర్​ హామీతో విరమణ

గద్వాల, వెలుగు: కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనడం లేదని ఆరోపిస్తూ జిల్లాలోని గద్వాల మండలంలో ఉన్న లత్తిపురము, చేనుగొనిపల్లి గ్రామాల రైతులు మంగళవారం కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నా అధికారులు వడ్లు కొనడం లేదని, కాంటా వేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు కుమ్మక్కై 8 కిలోల తరుగు తీస్తూ తమను నట్టేట ముంచుతున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కూడా అమ్ముకోలేక ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునేవారే కరువయ్యారన్నారు.

తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్ రైతుల దగ్గరకు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వినతిపత్రం ఇచ్చి నిరసన విరమించారు. తెలంగాణ రైతాంగ సమితి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ బండల వెంకట రాములు  రైతులకు సంఘీభావం తెలిపారు.

లారీలు రావడం లేదని ధాన్యానికి నిప్పు

హాలియా : నల్గొండ జిల్లాలో ఐకేపీ సెంటర్ కు వడ్ల లారీలు రావడం లేదని ఆగ్రహించిన రైతులు ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిప్పంటించారు. లారీలు రాక ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆరోపిస్తూ పెద్దవూర మండలం చలకుర్తి ఎక్స్ రోడ్​ వద్ద నాగార్జునసాగర్ – హైదరాబాద్ హైవేపై మంగళవారం రాస్తారోకో చేశారు. వారు మాట్లాడుతూ వారం రోజులుగా కాంటా వేస్తున్నప్పటికీ లారీలు రాకపోవడంతో నిల్వలుపేరుకుపోయి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదన్నారు.

రైతుల ఆందోళనతో సాగర్ హైవేపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. రాత్రి సమయంలో పెద్దవూర తహసీల్దార్, ఎస్ఐ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ధాన్యం తరలించడానికి లారీలను అందుబాటులో ఉంచుతామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.

వడ్లు దించుకోని మిల్లర్లు..  కొనేది లేదన్న ఐకేపీ నిర్వాహకులు

మెట్ పల్లి: వడ్ల కొనుగోళ్ల నుంచి తప్పుకుంటున్నట్లు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మనగర్ కొనుగోలు సెంటర్​నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. వడ్లు కొన్న తర్వాత తీసుకెళ్లేందుకు లారీలు రావడంలేదని, పంపిన వడ్లను మిల్లర్లు దించుకోవడం లేదని, అందుకే  తాము కొనుగోళ్ల నుంచి తప్పుకుంటున్నట్లు శాంతి పరస్పర సొసైటీ సభ్యులు తెలిపారు.

వడ్లు కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశిస్తున్నారని, మరోవైపు కొన్న వడ్లు మిల్లులకు చేరకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు.