
- కర్ణాటకకు తీసుకెళ్లి పత్తిని అమ్ముకుంటున్న అన్నదాతలు
- మద్దతు ధర లేక నష్టపోతున్న రైతన్నలు
గద్వాల, వెలుగు : జిల్లాలో పత్తి పండించిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కర్ణాటకకు వెళ్లి అగ్గువకు అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్ణాటకలో ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్‌గా మారి తేమ శాతం ఎక్కువగా ఉందని, క్వింటాల్ రూ.4 వేల నుంచి రూ.6,300 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.
లక్షా 20 వేల ఎకరాల్లో పంట సాగు..
జోగులాంబ గద్వాల జిల్లాలో లక్షా 20 వేల ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ పంటలకు 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో పంట సాగు చేసినా కొనుగోలుకు మాత్రం సరైన ఏర్పాట్లు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
పత్తి రైతులకు మద్దతు ధర దక్కడం లేదు..
పత్తి రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ఏ– గ్రేడ్ పత్తి క్వింటాల్‌కు రూ.8,110, మామూలు పత్తికి క్వింటాల్‌కు రూ.8000గా నిర్ణయించారు. గద్వాల జిల్లాలో మార్కెటింగ్ లేకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు రూ.6,200కు పత్తిని అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. కర్ణాటకలోని రాయిచూర్ మార్కెట్ కు తీసుకెళ్తే పత్తి గ్రేడ్ ను బట్టి రూ.5 వేలకు మించి పోవడం లేదు.
మూడు సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్..
జిల్లాలో రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు మూడు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. గతేడాది కేవలం ఒకే ఒక్క సీపీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మాత్రం మూడు కొనుగోలు కేంద్రాలు చేస్తామని తెలిపారు. ఆలంపూర్ నియోజకవర్గంలో రెండు, గద్వాల నియోజకవర్గంలో ఒక సీపీఐ పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు జిల్లాలో ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలేదు.
కర్ణాటక మార్కెట్ లో ఇబ్బందులు..
జిల్లా రైతులు కర్ణాటకలోని మార్కెట్ యార్డ్ కు పత్తిని తీసుకెళ్లి అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పత్తిని తీసుకెళ్లినా సాయంత్రం వరకు కొనుగోలు కాకపోవడంతో రెండు రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈసారి కర్ణాటకలోని రాయిచూర్ మార్కెట్ కు పత్తి ఎక్కువగా వస్తుండడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతులు చెబుతున్నారు. క్వింటాల్ పత్తిని కర్ణాటకకు తీసుకెళ్లడానికి రూ.500 వరకు ఖర్చు వస్తుందని, మద్దతు ధర రూ.6,300 వచ్చినా.. ట్రాన్స్‌పోర్టు, ఇతర ఖర్చులు తీసేస్తే మిగిలేది రూ.5,500 మాత్రమేనని రైతులు వాపోతున్నారు.
అక్టోబర్ చివరిలో సీసీఐ సెంటర్లు
ఇప్పట్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. అక్టోబర్ చివరి నాటికి సెంటర్లను ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ గా గద్వాలలో పత్తి కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాం. పత్తి రావడం లేదని సెంటర్లు ఓపెన్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారు. -పుష్పమ్మ, మార్కెటింగ్ ఆఫీసర్, గద్వాల