
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోపణ
- జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ లో ఘటన
గద్వాల, వెలుగు: చోరీ కేసులో నేరం ఒప్పుకోవాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ పోలీసులు రబ్బర్ పట్టాలతో బాగా కొట్టారని బాలుడు ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. మల్దకల్ మండలం మేకల సోంపల్లిలో ఇటీవల వరుస చోరీలు జరుగుతుండగా బాధితులు కంప్లైంట్ చేయడంతో స్థానిక ఎస్ఐ కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టాడు.
ఇందులో భాగంగా అదే గ్రామానికి చెందిన ఐదుగురిని స్టేషన్ కు తీసుకెళ్లి పోలీసులు విచారించారు. అయితే.. పోలీసులు తమను చిత్ర హింసలకు గురిచేశారని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలుడు ఆరోపిస్తున్నాడు.
ముగ్గురి వద్ద డబ్బులు తీసుకొని వదిలి పెట్టారని, మరో ఇద్దరిని నేరం ఒప్పుకోవాలంటూ రబ్బర్ పట్టాలతో చేతులు, కాళ్లపై తీవ్రంగా కొట్టారని ఆవేదనవ్యక్తం చేస్తున్నాడు. రూ. 50 వేలు ఇవ్వాలని లేదంటే చంచల్ గూడ జైలుకు పంపిస్తామంటూ పోలీసులు బెదిరించారని వాపోయాడు. తమను చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని గద్వాల ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బాలుడు డిమాండ్ చేశారు. దీనిపై స్పందిస్తూ చోరీ చేసినట్టు తేలడంతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మల్దకల్ పోలీసులు ఖండించారు