
గద్వాల టీఆర్ఎస్ లో భగ్గుమన్న విభేదాలు
ప్రభుత్వానికి గన్‌మెన్‌ల సరెండర్
బహిరంగ సభ పెట్టడమే కారణమా?
అప్పటికప్పుడు జడ్పీ సీఈవో మార్పు
గద్వాల అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మధ్య వర్గపోరు బహిర్గతమైంది. శుక్రవారం జడ్పీ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరు కావాల్సి ఉన్నా.. రాలేదు. దీంతో మధ్యలోనే వెళ్లిపోయిన ఎమ్మెల్యే ప్రభుత్వానికి గన్‌మెన్‌లను సరెండర్ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు సైతం గద్వాల నియోజకవర్గం నాయకులు ఎవరూ రాలేదు. అంతేకాదు అప్పటికప్పుడు జడ్పీ సీఈవోను సైతం మహబూబ్‌నగర్‌కు మార్చారు. ఇవన్నీ చూస్తుంటే మంత్రి, ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. – గద్వాల, వెలుగు
గద్వాల టీఆర్ఎస్లో రాజకీయ రగడ రాజుకున్నది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డి ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. తనకు గన్‌మెన్‌ల అవసరం లేదంటూ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి నిరంజన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన హాజరు కాకపోవటం మరింత చర్చకు దారి తీసింది. నివురు కప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. బహిరంగ సభకు సైతం గద్వాల నియోజకవర్గ నాయకులు ఎవరూ హాజరవ్వకపోవడం, ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే ఒక్కరే ప్రసంగించి బయటకు వెళ్లిపోవడం.. ఈ పరిణామాలు చూస్తుంటే అధికార టీఆర్ఎస్లో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయని చెప్పొచ్చు. బహిరంగ సభ పెట్టడమే విభేదాలకు కారణమని చర్చ సాగుతోంది. కానీ ఇంత వారం కోల్డ్‌వార్ జరిగిందని అది ఇప్పుడు సీరియస్‌కు దారి తీసిందని పలువురు టీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. పరిషత్ఎన్నికల్లో 12 జడ్పీటీసీ స్థానాలకు గాను 12 స్థానాలను టీఆర్ఎస్గెలుచుకొని ఊపుమీదున్న టీఆర్ఎస్కు ప్రమాణ స్వీకారం రోజే అధికారపక్షం లోనే విభేదాలు బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారాయి. గురువారం సాయంత్రం నుంచే టీఆర్ఎస్పార్టీలో అనూహ్య మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. మొదట గద్వాల జడ్పీ సీఈవోగా డీఆర్డీఏ పీడీ జ్యోతిని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా సాయంత్రం ఉత్తర్వులను సవరిస్తూ ఆమె స్థానంలో యాదయ్య కు పోస్టింగ్ ఇచ్చారు. ఇది జరిగిన వెంటనే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తనకు గన్మెన్లు అవసరం లేదంటూ తిప్పి పంపించారు. ఈ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఈవో మార్పుతోనే గన్‌మెన్‌లను వద్దన్నారని వివిధ రకాల వదంతులు వస్తున్నాయి.
మంత్రి గైర్హాజరు
గద్వాల జడ్పీ చైర్పర్సన్సబిత తిరుపతయ్య ప్రమాణ స్వీకారోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హాజరు కాలేదు. కేవలం గద్వాల, అలంపూర్‌ల ఎమ్మెల్యేలు మాత్రమే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఎంపీ రాములు, మంత్రి నిరంజన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు కూడా ఎవరూ హాజరు కాకపోవడం వర్గ విభేదాల్లో భాగమేనని పలువురు నేతలు చెప్తున్నారు.
బహిరంగ సభ పెట్టడమే కారణమా?
పరిషత్ఎలక్షన్ల వరకు టీఆర్ఎస్లో అంతా సవ్యంగానే కొనసాగింది. జడ్పీ చైర్మన్ ఎన్నిక తర్వాత విభేదాలు తలెత్తాయి. జడ్పీ చైర్మన్ పదవి కోసం గద్వాల, గట్టు, ధరూర్ జడ్పీటీసీలు పోటీ పడ్డారు. మొదట మానవపాడు జడ్పీటీసీ కి మాట ఇవ్వడం వల్ల ఆమెకే పదవి దక్కింది. దీంతో గద్వాల నియోజకవర్గ జడ్పీటీసీలందరూ మనస్థాపానికి గురయ్యారు. అనూహ్యంగా జడ్పీ చైర్మన్ ప్రమాణ స్వీకారం రోజు బహిరంగ సభ పెడుతున్నారనే సాకుతో రచ్చ చేశారని టీఆర్ఎస్లోని ఒక వర్గం వాదిస్తోంది. జడ్పీ చైర్మన్ ప్రమాణస్వీకారం అయ్యాక ర్యాలీగా వెళ్లండి.. అని ఓ నేత చెప్పగా.. బహిరంగ సభ ఎందుకని మరో నేత అన్నారు. దీనికి మరొక నేత అడ్డు తగినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య 5 రోజుల క్రితం తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే చిలికి చిలికి గాలివానలా మారి ఎమ్మెల్యే, మంత్రి మధ్య విభేదాలు స్థాయికి చేరిందని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు.