
HDFC Minimum Balance: ఒకపక్క ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ సంస్థలు తమ కస్టమర్లకు మినిమం బ్యాలెన్స్ రూల్స్ నుంచి ఉపశమనం కల్పిస్తున్నాయి. కానీ మరో పక్క ప్రైవేటు బ్యాంకులు మాత్రం తమ కస్టమర్లకు అకౌంట్లో కనీసం ఉంచాల్సిన మినిమం బ్యాలెన్స్ లిమిట్స్ పెంచేస్తున్నాయి. వారం ప్రారంభంలో ఐసిఐసిఐ కొత్త సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేయాలంటే మెట్రో నగరాల్లో కనీసం రూ.50వేలు మినిమం బ్యాలెన్స్ తప్పదంటూ కొత్త నిబంధనలు తీసుకొచ్చి అందరినీ షాక్ కి గురిచేసిన సంగతి తెలిసిందే.
దీనిని మరచిపోక మునుపే మరో దిగ్గజ బ్యాంక్ హెచ్‌డిఎఫ్‌సి కూడా తన కస్టమర్లకు మినిమం బ్యాలెన్స్ రూల్స్ అప్ డేట్ చేసింది. ఆగస్టు 1, 2025 నుంచి కొత్తగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసే కస్టమర్లకు ఈ పెంచిన మినిమం బ్యాలెన్స్ రూల్స్ వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. దీంతో మెట్రో, అర్బన్ ప్రాంతాల్లోని శాఖలో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే గతంలో ఉన్న రూ.10వేలు మినిమం బ్యాలెన్స్ లిమిట్ ప్రస్తుతం రూ.25వేలకు పెంచేసింది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. ఒకవేళ మినిమం బ్యాలెన్స్ రూల్స్ కంటే ఖాతాలో తక్కువ నగదు ఉన్నట్లయితే రూల్స్ ప్రకారం పెనాల్టీ ఛార్జీలు వసూలు చేస్తామని బ్యాంక్ వెల్లడించింది.
ఖాతాలో మినిమం బ్యాలెన్స్ పాటించకపోతే మెట్రో సేవింగ్స్ ఖాతలపై 6 శాతం లేదా రూ.600 వరకు పెనాల్టీ వర్తిస్తుందని బ్యాంక్ చెప్పింది. ఇకపోతే బ్యాంక్ తన క్లాసిక్ కస్టమర్లు నెలకు రూ.లక్ష మినిమం బ్యాలెన్స్ లేదా త్రైమాసికంలో రూ.2 లక్షల్లో ఏదో ఒకటి కలిగి ఉంటే సరిపోతుందని వెల్లడించింది హెచ్‌డిఎఫ్‌సి. లేదంటే కస్టమర్ శాలరీడ్ అయితే నెలకు కనీసం లక్ష రూపాయలు లేదా అంత కంటే ఎక్కువ వేతనం జమ అయినా సరిపోతుందని స్పష్టం చేసింది.
ALSO READ : రష్యా ఆయిల్‌తో జనానికి పైసా లాభం లేదు
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ మాత్రం కస్టమర్లు ఎలాంటి మినిమం బ్యాలెన్స్ తమ సేవింగ్స్ ఖాతాలో ఉంచకపోయినా పెనాల్టీలు ఉండవని వెల్లడించింది. ఇక కోటక్ బ్యాంక్ తన క్లాసిక్ సేవింగ్స్ ఖాతాకు రూ.10వేలు, యెస్ బ్యాంక్ ప్రో ప్లస్, ఎసెన్స్ సేవింగ్స్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ రూ.25వేలుగా ఉంచాయి. ఇక యెస్ బ్యాంక్ ప్రో మ్యాక్స్ సేవింగ్స్ ఖాతా మినిమం బ్యాలెన్స్ రూ.50వేలుగా ఉంచాయి.