అన్నపూర్ణ స్టూడియోస్ కు 50 ఏళ్లు.. రాళ్ళ గుట్టల నుంచి రీళ్ళ ప్రపంచం వరకు!

అన్నపూర్ణ స్టూడియోస్ కు 50 ఏళ్లు..  రాళ్ళ గుట్టల నుంచి రీళ్ళ ప్రపంచం వరకు!

హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో జూబ్లీహిల్స్ ఒకటి. ఒకప్పుడు ఈ ప్రాంతమంతా బీడు భూములులతో నిండివుండేది. ఇక్కడ రద్దీ రోడ్లు లేవు, ట్రాఫిక్ లేదు, బంగళాలు లేవు. కనుచూపు మేర ఎటు చూసినా కొండలు, గుట్టలు, పాములు తప్ప మరేమీ కనిపించేవి కావు.  నడిచేందుకు కనీసం దారి కూడా సరిగా ఉండేది కాదు.

మద్రాసు నుంచి హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ
అటువంటి సమయంలో ఒక విజనరీ ఆలోచనతో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ముందుకు వచ్చారు.  తెలుగు చిత్ర పరిశ్రమ తన సొంత గడ్డపై ఉండాలని సంకల్పించారు.  తన దూరదృష్టితో 1975 ఆగస్టు, 13న ఈ బీడు భూమిలో అన్నపూర్ణ స్టూడియోస్ కు పునాది రాయి వేశారు.  తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్ కు తరలించాలనే అక్కినేని ఆకాంక్షలకు అనుగుణంగా అన్నపూర్ణ స్టూడియోస్  ప్రాణం పోసుకుంది.  ఆ రోజుల్లో జూబ్లీహిల్స్‌కు రోడ్డు కూడా లేకపోవడంతో, ఆయన ఆ ప్రదేశానికి కాలినడకన చేరుకుని ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని ప్రారంభించారు. ఎడ్లబండిపై నిర్మాణ సామాగ్రిని తరలించి  స్టూడియో నిర్మాణాన్ని పూర్తి చేశారు.

నాడు అక్కినేని నాగేశ్వరరావు తీసుకున్న ముందడుగుతో జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్, కృష్ణా నగర్ వంటి ప్రాంతాల అభివృద్ధికి నాంది పలికింది.  అప్పటినుండి, అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం ఒక స్టూడియో మాత్రమే కాదు, అది హైదరాబాద్ ఫిల్మ్ ఎకోసిస్టమ్‌కు ఒక ఊపిరి పోసింది. 1976 జనవరి 14న నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఈ స్టూడియోను అధికారికంగా ప్రారంభించారు. ఆ రోజు నుండి అన్నపూర్ణ స్టూడియోస్ దినదినాభివృద్ధి చెందుతోంది.

స్టూడియో కాదు..  సినీ సామ్రాజ్యం..
అన్నపూర్ణ స్టూడియోస్ అంటే కేవలం ఒక నిర్మాణ స్థలం కాదు, అది ఒక సృజనాత్మక సామ్రాజ్యం. ఇక్కడ అనేక చిత్రాలు, టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, వాణిజ్య ప్రకటనలు రూపుదిద్దుకున్నాయి. నేడు, ఈ స్టూడియోలో అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో కూడిన ఎన్నో షూటింగ్ ఫ్లోర్‌లు, అవుట్‌డోర్ సెట్లు, పోస్ట్-ప్రొడక్షన్ సౌకర్యాలు ఉన్నాయి. ఈ సౌకర్యాలు దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా అగ్రశ్రేణిలో ఉన్నాయి.

స్టూడియోలోనే మెరీనా బీచ్ సెట్
 'మనసంతా నువ్వే' చిత్రం కోసం నిర్మించిన ప్రసిద్ధ మెరీనా బీచ్ సెట్, 'శ్రీరామదాసు' చిత్రం కోసం నిర్మించిన భద్రాచలం గుడి సెట్ వంటివి ఇక్కడ నిర్మించిన అత్యుత్తమ కళాఖండాల్లో కొన్ని. అలాగే, 'ప్రాణభయాలు', 'అందాల రాముడు', 'సీతారామయ్యగారి మనవరాలు', 'శివమణి', 'మనం' వంటి ఎన్నో సినిమాలు ఇక్కడి స్టూడియోలో షూటింగ్ జరుపుకొని విజయం సాధించాయి.  అంతే కాదు అనేక చిత్రాలను కూడా అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించింది.

భవిష్యత్తు కోసం విద్యా కేంద్రం
ANR కళను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ, అన్నపూర్ణ స్టూడియోస్ ఇప్పుడు కేవలం సినిమాల నిర్మాణానికే పరిమితం కాలేదు. యువ ప్రతిభను ప్రోత్సహించడానికి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను స్థాపించింది. ఈ కాలేజీలో యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, సౌండ్ డిజైన్ వంటి అనేక కోర్సులను బోధిస్తున్నారు. ఈ సంస్థ దేశంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ప్రతి ఏటా వందలాది మంది విద్యార్థులు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతూ, ANR గారి కలను సజీవంగా ఉంచుతున్నారు.

విజయాల ప్రయాణంలో 50 ఏళ్ళు
ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ తన 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఒకప్పుడు బీడు భూమిగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు భారతీయ సినిమాలోని అత్యంత సృజనాత్మక కేంద్రాలలో ఒకటిగా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రయాణం ఒక కల నుంచి ప్రారంభమై, నిజమై, మరెంతో మంది కలలకు వేదికగా నిలిచింది. ఒక వ్యక్తి దూరదృష్టితో మొదలైన ఈ స్టూడియో ప్రస్థానం, తెలుగు సినిమా భవిష్యత్తుకు ఒక బ్రహ్మాండమైన పునాదిగా నిలిచింది.

ఈ 50 ఏళ్ల ప్రయాణం కేవలం ఒక స్టూడియో విజయగాథ మాత్రమే కాదు, ఒక దృఢ సంకల్పం, ఒక నిర్విరామ కృషి, ఒక గొప్ప కల నిజమైన తీరుగా నిలిచింది. ఈ ప్రస్థానంలో ఎంతో మంది నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు భాగమయ్యారు. వారిందరి కృషి ఫలితమే నేటి అన్నపూర్ణ స్టూడియోస్. మరో వైపు అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్లను పూర్తిచేసుకున్న సందర్భంగాఅక్కినేని నాగార్జున , అమల కలిసి నటించిన సూపర్ బ్లాక్ బాస్టర్ 'శివ' చిత్రాన్ని 4Kలో  రీ రిలీజ్ చేస్తున్నారు.