గద్వాల, వెలుగు: కేంద్ర ప్రభుత్వం విమానాశ్రయాలకు దీటుగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఆదివారం సాయంత్రం గద్వాల రైల్వే స్టేషన్ లో ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకంలో భాగంగా రూ.13 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాన్య ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా స్టేషన్ లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ రూమ్స్, గద్వాల కోట శైలిలో ముఖద్వారం లాంటి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మే 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారని చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, అలంపూర్ స్టేషన్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని, గద్వాలలో అన్ని ముఖ్యమైన రైళ్లు ఆగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

