గద్వాల జడ్పీ చైర్ పర్సన్ దంపతులపై కేసు

గద్వాల జడ్పీ చైర్ పర్సన్ దంపతులపై కేసు

గద్వాల, వెలుగు : స్థలం అమ్మకానికి ఉందని చెప్పి అడ్వాన్స్ తీసుకొని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పీ చైర్ పర్సన్, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత, ఆమె భర్త తిరుపతయ్య అలియాస్ కిరణ్ కుమార్ కొన్ని రోజులుగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కిరణ్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడలో155 చదరపు గజాల ఇంటి స్థలం ఉందంటూ  అమ్మకానికి పెట్టారు.

శంషాబాద్ మండలం మల్కారం గ్రామానికి చెందిన జంగయ్యకు గజం రూ. 26,500 చొప్పున అమ్ముతామంటూ రూ. 30 లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్నారు. జంగయ్య స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని పలుసార్లు కోరినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అనుమానం వచ్చిన జంగయ్య రిజిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్స్ పరిశీలించగా భూమి జడ్పీ చైర్ పర్సన్ దంపతులది కాదని తేలింది. మోసపోయానని గుర్తించిన జంగయ్య శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కోర్టు ఆదేశం మేరకు జడ్పీ చైర్ పర్సన్ దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.