
- క్రూ మాడ్యూల్‌ను హెలికాప్టర్ నుంచి జారవిడిచిన సైంటిస్టులు
బెంగళూరు: భారత మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్ యాన్’ మిషన్ దిశగా ఇస్రో మరో కీలక ముందడుగు వేసింది. ఆస్ట్రోనాట్ లను స్పేస్ కు తీసుకెళ్లి, తిరిగి భూమికి తీసుకువచ్చే క్రూ మాడ్యూల్ కు తొలి ఎయిర్ డ్రాప్ టెస్టును విజయవంతంగా నిర్వహించింది. ఆదివారం ఏపీలోని శ్రీహరికోట సమీపంలో సముద్రంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ (ఐఏడీటీ1) పరీక్ష సక్సెస్ అయినట్టు ఇస్రో వెల్లడించింది. ‘‘టెస్టులో భాగంగా క్రూ మాడ్యూల్ ను వాయుసేన చినూక్ హెలికాప్టర్ ద్వారా 4 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచారు.
వెంటనే దశలవారీగా మాడ్యూల్‌కు ఉన్న 3 పారాచూట్లు విచ్చుకుని, వేగాన్ని కంట్రోల్ చేశాయి. మాడ్యూల్ సేఫ్‌గా సముద్రతలంపై స్ప్లాష్ డౌన్ అయింది. పారాచూట్లను పరీక్షించేందుకు చేపట్టిన ఈ టెస్టు పూర్తి స్థాయిలో విజయవంతం అయింది” అని ఇస్రో తెలిపింది. వాయుసేనతోపాటు డీఆర్డీవో, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్‌తో కలిసి ఈ టెస్టును చేపట్టినట్టు పేర్కొంది. కాగా, గగన్ యాన్ మిషన్‌లో భాగంగా ముగ్గురు ఆస్ట్రోనాట్లను 2028లో అంతరిక్షానికి పంపేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది.
ఈ ఏడాది డిసెంబర్లో తొలి టెస్ట్ ఫ్లైట్ చేపట్టి ‘వ్యోమమిత్ర’ అనే రోబోను అంతరిక్షానికి పంపనుంది. తాజాగా క్రూ మాడ్యూల్‌కు తొలి ఎయిర్ డ్రాప్ టెస్టును విజయవంతంగా చేపట్టిన ఇస్రో సైంటిస్టులు.. దీనికి డిసెంబర్ లోపు మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు.