మెదక్, వెలుగు: పీఆర్సీపై సీఎం వెంటనే ప్రకటన చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజేందర్ డిమాండ్ చేశారు. ఎస్టీయూ టీఎస్ మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ గౌడ్ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు.
ఈహెచ్‌ఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి, రెగ్యులర్ ఎంఈవో, డిప్యూటీ ఈవో, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో 190 ప్రకారం ఇంటర్ లోకల్ డిప్యూటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కోరారు.
పాఠశాల విద్యా శాఖ హేతుబద్దీకరణ పేరుతో ఖాళీ పోస్టులను రద్దు చేసే ఆలోచన మానుకోవాలన్నారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ లో ప్రభుత్వం కేటాయింపులు పెంచాలని కోరారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఇందుకోసం చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నరేశ్, రాష్ట్ర బాధ్యులు నర్సింలు, రాజు, జిల్లా ఆర్థిక కార్యదర్శి కిష్టయ్య, భూపతిగౌడ్, అశోక్, నాగరాజు, శ్రీనివాస్, బాలకృష్ణ, వేణు గోపాల్, శివప్రసాద్, ఎల్లం, అరుణ్ పాల్గొన్నారు.
