- గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల గోస
- మూడేండ్లుగా ఇండ్ల అప్పగింత కోసం ఎదురుచూపులు
సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారులు మూడేండ్లుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. పేదల కోసం నిర్మించిన ఇండ్లను మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాత్కాలికంగా కేటాయించడంతో వారు ఖాళీ చేయడం లేదు. దీంతో ఇండ్లు లభించిన లబ్ధిదారులు వాటిని అప్పగించాలని కోరుతూ అధికారులు చుట్టు తిరుగుతున్నారు. మరోవైపు ఖాళీగా ఉన్న కొన్ని ఇండ్లలో కొందరు లబ్ధిదారులు వెళ్లి నివాసం ఉంటున్నారు.
ఇంకా 600 మందికి పైగా లబ్ధిదారులు ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని పట్టించుకోక పోవడం, లబ్ధిదారులను ఎంపిక చేసిన అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో సమస్య జఠిలంగా మారింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారులు ఇప్పటికైనా ఇండ్లను అప్పగించేలా చేయాలని నాయకులను కోరుతున్నారు.
పెండింగ్లో ఇండ్ల అప్పగింత
గజ్వేల్ మున్సిపాలిటీలో 1250 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించగా వాటిలో 132 రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోయిన వారికి కేటాయించారు. మిగిలిన 1118 ఇండ్లకు 2021లో నోటిఫికేషన్ విడుదల చేసి దరఖాస్తులను ఆహ్వానించారు. పేదల నుంచి 3512 దరఖాస్తులు రాగా వాటని పరిశీలన పంపారు. జిల్లాస్థాయి అధికారుల బృందాల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఏడాదిన్నర పాటు సాగిన సర్వే అనంతరం 1118 మంది లబ్ధిదారుల డ్రాఫ్ట్ లిస్టును ప్రకటించినా కొన్ని అభ్యంతరాలు రావడంతో లక్కీ డ్రా ద్వారా 1100 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. కానీ వారికి ఇండ్లను అప్పగించే విషయంలో సమస్య ఏర్పడింది. దీంతో లబ్ధిదారులు నిరసనలు, ధర్నాలు నిర్వహించడమే కాకుండా ఏకంగా కేసీఆర్ ఫామ్ హౌజ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించినా ఫలితం మాత్రం రాలేదు.
నిర్వాసితులు ఖాళీ చేయకపోవడమే సమస్య
పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మల్లన్న సాగర్ నిర్వాసితులకు తాత్కాలికంగా కేటాయించారు. నిర్వాసితుల పరిహారాలు, ప్యాకేజీలు పెండింగ్ లో ఉండడంతో వారు ఇండ్లను ఖాళీ చేయడం లేదు. రెవెన్యూ అధికారులు వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలు చేసినా తమ పరిహారాలు పూర్తిగా చెల్లించిన తర్వాతనే ఖాళీ చేస్తామని తేల్చి చెప్పడంతో వారు వెనుదిరిగారు. దీంతో ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్లను అప్పగించే పరిస్థితి లేకుండా పోయింది.
అద్దె ఇంటిలోనే నివాసం
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరైనా మూడేండ్లుగా అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. మల్లన్న సాగర్ నిర్వాసితులు ఖాళీ చేయకపోవడంతో మాకు కేటాయించిన ఇండ్లలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అధికారులను ఎన్నిసార్లు కలిసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మా ఇంటిని మాకు కేటాయించాలి - బొజ్జ భార్గవి, లబ్ధిదారు
నిర్వాసితులను ఖాళీ చేయించాలి
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చిందని సంబరపడ్డా. కానీ ఏండ్లు గడుస్తున్నా ఇంత వరకు ఇంటిని అప్పగించడం లేదు. మల్లన్న సాగర్ నిర్వాసితులు ప్యాకేజీలు రాలేదని ఇండ్లను ఖాళీ చేయడం లేదు. అధికారులు తగిన చర్యలు తీసుకుని నిర్వాసితులను ఖాళీ చేయించి మాకు కేటాయించిన ఇండ్లను ఇవ్వాలి. శివగౌని మాధవి, లబ్ధిదారు
